గుజరాత్ రంగం ..హార్దిక్ విలన్

   hardik patel hero villain gujarat
రంగం..తమిళ్ నుంచి తెలుగులో డబ్బింగ్ అయ్యి భారీ హిట్ కొట్టిన సినిమా.ఆ సినిమా విలన్ కూడా యువనాయకుడే .రాజకీయాల్ని మారుస్తానని చెప్పి తానే ఆ రొచ్చులోకి వెళతాడు.పటేల్ రిజర్వేషన్ ఉద్యమం ద్వారా దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న హార్దిక్ పటేల్ అదే కోవలోకి వస్తాడా ?మోడీ సొంతగడ్డ మీదే కమలాన్ని గజగజలాడించిన ఆ యువనాయకుడు కూడా అవినీతి సామ్రాట్టేనా ? ఔననే అంటున్నారు నిన్నమొన్నటి దాకా అయన వెన్నంటే ఉన్న చిరాగ్ పటేల్,కేతన్ పటేల్..ఈ ఇద్దరు కూడా హార్దిక్ తో పాటు పటేల్ ఉద్యమం లో చురుగ్గా పాల్గొని 8 నెలలపాటు జైలు జీవితం కూడా గడిపారు .రెండు రోజుల కిందట వీళ్ళు హార్దిక్ కి రాసిన లేఖ బయటకొచ్చింది.అందులో విషయాలు చూసి గుజరాత్ సమాజం ..ముఖ్యంగా పటేళ్లు నివ్వెరపోయారు .

ఉద్యమ నిర్వహణ,అమరులైన వారి కుటుంబాల్ని ఆదుకోడానికి సేకరించిన విరాళాల్ని హార్దిక్ తన విలాసాలకు వాడుకొన్నట్టు ఆయన పాతమిత్రులు లేఖలోప్రస్తావించారు .హార్దిక్,అయన బాబాయ్ అవే డబ్బుతో ఖరీదైన కార్లు కొనుక్కున్నారని కూడా ఆలేఖలోఆరోపించారు.జైలు కెళ్ళొచ్చాక ఎవరి ఆర్ధిక పరిస్థితి అయినా దెబ్బతింటుంది …కానీ నీ జీవితం కోట్లరూపాయలతో ఎలా వర్థిల్లుతోందని ఆ లేఖలోహార్దిక్ ని ప్రశ్నించారు.హార్దిక్ వ్యవహారశైలి వల్ల మొత్తం పటేల్ సమాజానికి నష్టం వాటిల్లిందని చిరాగ్,కేతన్ వాదించారు .వారి లేఖ గుజరాత్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

ఈ లేఖపై హార్దిక్ నోరు మెదపలేదు.అయన అనుచరులు మాత్రం ఉద్యమాన్ని దెబ్బ కొట్టడానికి ప్రభుత్వం హార్దిక్ పాత మిత్రుల్ని వాడుకుంటోందని ఆరోపించారు.ఒకప్పుడు వున్న ప్రాధాన్యం ఇప్పుడు తమకు దక్కడం లేదన్న కడుపుమంట తోనే చిరాగ్,కేతన్ ఇలా లేఖ రాసారని అంటున్నారు.కానీ తాజా పరిణామాలతో హార్దిక్ ని పటేల్ సమాజం సందేహం గా చూడటం మొదలయింది.మరోవైపు అప్పటి ముఖ్యమంత్రి తీసుకున్న రిజర్వేషన్ నిర్ణయం చెల్లదని కోర్టు ఇంతక ముందే తీర్పిచ్చింది.ఈ పరిస్థితులన్నీ ఒకప్పుడు హీరో గా వెలిగిన హార్దిక్ ని విలన్ ని చేశాయి .అంతకన్నా జరిగిన భారీనష్టం ఇంకోటుంది.రాజకీయాల్లోకి వారసత్వంగా కాకుండా ప్రజాక్షేత్రం నుంచి యువకులు వచ్చి ప్రభావం చూపించగలరని ..హార్దిక్ విశ్వాసం కల్పించాడు.ఫర్లేదు అనుకునేంతలోపే ఆ ఆశల్ని అడియాసలు చేశాడు.

SHARE