Posted [relativedate]
సినిమావాళ్లకి సెంటిమెంట్స్ ఎక్కువ. సినిమాకి కొబ్బరికాయ కొట్టింది మొదలు సినిమా పూర్తయ్యి గుమ్మడి కాయ కొట్టేవరకు అన్నింటిలోనూ వాళ్లు తమకు అచ్చొచ్చిన ప్రాసెస్ నే ఫాలో అవుతుంటారు. ఇప్పుడు హరీష్ శంకర్ కూడా అదే రూట్లో నడుస్తున్నాడు.
హరీష్ శంకర్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ‘దువ్వాడ జగన్నాథమ్’ సినిమా తెరకెక్కుతోందన్న విషయం తెలిసిందే. శరవేగంగా షూటింగ్ నడుస్తున్న ఈ సినిమా ఏప్రిల్ లో విడుదలకానుంది. కాగా సినిమాపై ఆసక్తిని కలిగించే విధంగా రెడీ చేస్తున్న టీజర్ ని శివరాత్రి రోజున రిలీజ్ చేయడానికి నిర్ణయించుకున్నాడట దర్శకుడు. శివరాత్రి రోజునే టీజర్ రిలీజ్ చేయడం వెనుక అతనికి ఓ సెంటిమెంట్ ఉందట.
గతంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన గబ్బర్ సింగ్ టీజర్ కూడా మహా శివరాత్రి రోజే విడుదల అయిందట. కాగా ఆ సినిమా రిలీజైన తర్వాత ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్ తో అల్లు అర్జున్ నటిస్తున్న దువ్వాడ జగాన్నాధమ్ టీజర్ ను విడుదల చేయాలనుకుంటున్నాడట హరీష్ శంకర్. మరి పవన్ విషయంలో సక్సెస్ ని అందించిన సెంటిమెంట్ బన్నీ విషయంలో వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి.