దాపరికం ఎందుకు?అమరావతిపై హైకోర్ట్ ప్రశ్న …

 high court question about amaravathi swis challangeఅమరావతి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న స్విస్ ఛాలెంజ్ పద్ధతిపై దాపరికం ఎందుకని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వ ఆస్తులకు అధికారులు కేవలం ధర్మకర్తలు మాత్రమేనని, ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకోవడానికి ఇవి ప్రైవేటు ఆస్తులు కాదని వ్యాఖ్యానించింది. సిఆర్‌డిఎ కమిషనర్ పారదర్శకంగా వ్యవహరించడం లేదంటూ ఆదిత్య హౌసింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు విచారణ చేపట్టారు. స్విస్ చాలెంజ్ పద్ధతికి సంబంధించిన సమాచారాన్ని ఆసాంతం వెల్లడించాల్సిందేనని ఆదేశించారు.

ఇందుకు సంబంధించి శుక్రవారం నాడు మధ్యంతర ఉత్తర్వులు వెలువరించనున్నారు. తొలుత పాల్గొన్న బిడ్డర్ వివరాలు బహిర్గతం చేయలేమని, అది ఆ సంస్థ యాజమాన్య హక్కని అడ్వకేట్ జనరల్ డి శ్రీనివాస్ వాదించారు. దానిపై న్యాయమూర్తి స్పందిస్తూ ‘ఏ సాధికారతతో మీరీ విషయం చెబుతున్నారు?’ అని ప్రశ్నించారు. గతంలో జస్టిస్ వివిఎస్ రావు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు ప్రకారం స్విస్ చాలెంజ్‌కు సంబంధించి మొత్తం సమాచారం వెల్లడించాల్సిందేనన్నారు. సమాచారాన్ని బహిర్గతం చేయలేమన్న అడ్వకేట్ జనరల్ చేసిన వ్యాఖ్యలకు న్యాయమూర్తి స్పందిస్తూ, ఈ మొత్తం విధానం చూస్తుంటే ఇది స్విస్ ఛాలెంజ్ విధానానికి విరుద్ధంగా కనిపిస్తోందని అన్నారు. మీరు నిర్మించబోయేది సొంత ఆస్తులతో కాదు, ప్రజల ఆస్తితో. స్విస్ ఛాలెంజ్ పద్ధతికి కట్టుబడి ఉండకపోతే టెండర్లను ఎందుకు పిలవలేదు అని న్యాయమూర్తి ప్రశ్నించారు.

SHARE