పుట్టినరోజు జరుపుకోవడం ఎలా?

231
Spread the love

 Posted [relativedate]

how to celebrate birthdayకాల విభాగంలో తప్పకుండా గుర్తు పెట్టుకొని తాను జరుపుకోవలసినవి కొన్ని ఉంటాయి. అందులో పుట్టినరోజు ఒకటి. నేను నా పుట్టినరోజు చేసుకోనండీ అనకూడదు. తన పుట్టినరోజు తాను చక్కగా జరుపుకోవాలి. ఆ జరుపుకోవడానికి శాస్త్రం ఒక విధిని నిర్ణయించింది. పుట్టినరోజు జరుపుకొనే వ్యక్తి ఆ రోజు తెల్లవారు ఝామున నిద్రలేచి అభ్యంగన స్నానం చేయాలి. ఒంటికి నూనె రాసుకుంటే అలక్ష్మి పోతుంది. నూనె అలదుకొని తలస్నానం చేస్తారు. చేసేముందు పెద్దవాళ్ళు తలమీద నూనె పెట్టి ఆశీర్వచనం చేయడం, వెన్నుపాము నిమరడం, ఆచారంగా వస్తోంది. స్నానం చేసిన తర్వాత ఇష్టదేవతారాధన చేయాలి. ఇంట్లో కులదైవం, ఇష్టదైవం ఉంటారు. వారిరువురినీ ఆరాధన చేయాలి. తర్వాత ఆవుపాలలో బెల్లంముక్క, నల్ల నువ్వులు, కలిపిన పదార్థాన్ని మౌనంగా తూర్పు దిక్కుకు తిరిగి మూడుమార్లు చేతిలో ఆచమనం చేస్తే ఎలా తీసుకుంటామో అలా మూడుమార్లు లోపలికి పుచ్చుకోవాలి. ఇలా ఆ పదార్థాన్ని మూడుమార్లు పుచ్చుకుంటే వచ్చే పుట్టినరోజు లోపల ఏదైనా గండకాలం ఉంటే అది తొలగిపోతుంది అని. ఆ తర్వాత ఏడుగురు చిరంజీవులు – పుట్టుకతోనే చిరంజీవిత్వాన్ని పొందారు, ఇంకొంతమంది చిరంజీవిత్వాన్ని సాధించుకున్న వాళ్ళున్నారు.
పుట్టుకతో చిరంజీవులైన వాళ్ళు – అశ్వత్థామ బలిర్వాసో హనూమాంశ్చ విభీషణః!
కృపః పరశురామశ్చ సప్తైతే చిరజీవినః!!

ఈ ఏడుగురు పేర్లు మనసులోనన్నా స్మరించాలి. పైకన్నా చెప్పాలి. ఆరోజున తల్లిదండ్రులకి, గురువుగారికి తప్పకుండా నమస్కారం చేసి వాళ్ళ ఆశీర్వచనం అందుకోవాలి. ఇంటికి దగ్గరలో ఉన్న దేవాలయాన్ని దర్శనం చేయాలి. చక్కగా మృష్టాన్న భోజనం చేయవచ్చు. రాత్రి మాత్రం బ్రహ్మచర్యాన్ని పాటించాలి. తన శక్తికొలదీ దానధర్మాలు నిర్వహించాలి. తనకి ఐశ్వర్యం ఉందా? దానం చేస్తాడు. ఐశ్వర్యం లేదు – గోగ్రాసం అంటారు. చేతినిండా కాసిని పచ్చగడ్డిపరకలు పట్టుకెళ్ళి ఒక ఆవుకి తినిపించి ప్రదక్షిణం చేసి నమస్కరిస్తే చాలు. ఇవి పుట్టినరోజు నాడు తప్పకుండా జ్ఞాపకం పెట్టుకొని చేయవలసిన విషయాలు. వీటికి విరుద్ధంగా పుట్టినరోజును చేసుకోకూడదు. పుట్టినరోజు సరదాకోసం, వినోదం కోసం చేసుకొనేది కాదు. ఆయుర్దాయ సంబంధమైనటువంటిది. ఆరోజు దీపం చాలా ప్రధానం. పొరపాటున అక్కర్లేని విషయాలు పిల్లలకి నేర్పితే అవే విశృంఖలత్వాన్ని పొందుతాయి రేపు ప్రొద్దున. ఎన్నో పుట్టినరోజు చేసుకుంటున్నాడో అన్ని కొవ్వొత్తులు వెలిగించడం ఉఫ్ అని ఊదుతూ దీపాలార్పేయడం పరమ అమంగళప్రదమైన విషయం. దీపాలు ఆర్పి చేతితో కత్తి పట్టుకొని ఏదో నిన్నరాత్రో మొన్నరాత్రో తయారుచేసిన ఒక పదార్థం, ఎవడు చేసిన ఆశీర్వాదమో అర్థం కాదు రంగురంగులుగా వ్రాసిన Happy Birthday, అర్థం లేకుండా అందరూ నిలబడి కొడుతున్న తప్పట్లు, వీటి మధ్యలో కత్తితో కోసి నిర్లజ్జగా భార్య నోట్లో సభాముఖంగా పెట్టడం, ఇలాంటి పిచ్చపనులు చేయమని శాస్త్రాలలో లేదు. దీపాన్ని గౌరవించు, దీపం వెలిగించు. దీపం దగ్గర మట్టుమీద అక్షతలో, ఒకపువ్వో వేసి నమస్కారం చెయ్యి. అది నీ ఇంట కాంతి నింపుతుంది. జీవితాన్ని నిలబెడుతుంది. గురువుగారికి, తల్లిదండ్రులకి, పెద్దలకి నమస్కారం చెయ్యి. వాళ్ళనోటితో వాళ్ళు ఆశీర్వదించాలి “శతమానం భవతి శతాయుః పురుషశ్శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతితిష్ఠతి” అని. చక్కగా దేవాలయానికి వెళ్ళి నీపేరు మీద పూజ చేయించుకో. ఈశ్వరుడి అర్చన చెయ్యి. అపమృత్యు దోషం కబళించకుండా ఉండడానికి నల్లనువ్వులు, బెల్లం, ఆవుపాలు కలిసిన పదార్థాన్ని మూడుమార్లు పుచ్చుకో. సప్తచిరజీవుల పేర్లు మనస్సులో స్మరించడం, లేదా పైకి చెప్పడం, అదీ పుట్టినరోజు జరుపుకొనే విధానం.(ముఖ పుస్తకంలో వచ్చిన బ్రహ్మశ్రీ.చాగంటి.కోటే స్వర రావు గారి ప్రవచనం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here