Posted [relativedate]
భూమా నాగిరెడ్డి జీవితమంతా పోరాటమే. ఎప్పుడూ ఆయన నిశ్చింతగా ఉండలేకపోయారు. ఆయన పుట్టి పెరిగిన వాతావరణం, కుటుంబ పరిస్థితులు ఆయనను కుదురుగా ఉండనివ్వలేదు. అందుకే చిన్న వయస్సులోనే పెద్ద బాధ్యతలను తలకెత్తుకున్నారు. తన జీవితకాలమంతా రాజకీయ చదరంగంలో ఎదురీదారు.
తండ్రి మరణంతో ఉన్నత చదువులను మధ్యలోనే వదిలేసి సొంతూరుకు వచ్చారు భూమా నాగిరెడ్డి. ఆ తర్వాత సొంత వర్గాన్ని కాపాడుకోవడం కోసం రాజకీయాల్లోకి రాక తప్పలేదు. చిన్న వయస్సులోనే ఎంపీపీ అయిపోయారు. ఈ లోపే సోదరుడి మరణం భూమాను కుంగదీసింది. అంతలోనే ఉప ఎన్నికలు. సోదరుడి మరణాన్ని దిగమింగుకొని ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆ తర్వాత అనుకోకుండానే ఫ్యాక్షన్ ఉచ్చులో ఇరుక్కున్నారు. తన ప్రమేయం లేకుండానే ఫ్యాక్షన్ నాయకుడిగా ముద్రపడ్డారు. ఆ ముద్ర వల్లే శోభమ్మను పెళ్లి చేసుకునే సమయంలో ఆమె కుటుంబం నుంచి ఇబ్బందులు వచ్చాయి. అంతా సర్దుకుంది అనుకునేలోపే కుటుంబ బాధ్యతలు మీద పడ్డాయి. సోదరుల పిల్లల బాధ్యతలను చూసుకోవడంతో పాటు రాజకీయాలకు సమయం కేటాయించక తప్పలేదు.
ఒకపక్క రాజకీయాలు మరో పక్క ఫ్యాక్షన్ గొడవలు.. ఇవన్నీ చాలవన్నట్టు కుటుంబ బాధ్యతలు వీటన్నింటితో ఆయన జీవితమంతా టెన్షన్ టెన్షన్ గా గడిచింది. ఆయన జీవితంలో మనశ్శాంతి లేకుండా పోయింది. అందుకే తన బాధ్యతలను తగ్గించుకునేందుకు ఆయన శోభను కూడా రాజకీయాల్లోకి తీసుకురాక తప్పలేదు. ఇక అంతా హ్యాపీ అనుకుంటున్న సమయంలో 2004 నుంచి రాజకీయ జీవితంలో ఎదురుదెబ్బలు తగిలాయి. ఓటమి పాలవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత పీఆర్పీలోకి వెళ్లారు. అక్కడ ఇమడలేకపోయారు. చివరకు వైసీపీలోకి ఎంట్రీ ఇచ్చారు. కానీ ఈలోపే రోడ్డు ప్రమాదంలో శోభమ్మ మృతి చెందారు. ఈ షాక్ నుంచి ఆయన తేరుకోలేకపోయారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వైసీపీని వీడారు. గతేడాదే టీడీపీలోకి రీ ఎంట్రీ ఇచ్చారు.
టీడీపీలోకి రీఎంట్రీ ఇచ్చినా.. ఒకే పార్టీలో వైరి వర్గం ఉండడంతో ఆయన టెన్షన్ పడ్డారు. జీవితంలో ఒక్కసారైనా మినిస్టర్ కావాలనే తన కల నెరవేరుతుందో లేదోనని ఆందోళన చెందారు. ఆ క్రమంలో కొంత వెనక్కు తగ్గి శిల్ప బ్రదర్స్ తో రాజీ చేసుకున్నారు. అందుకు తగ్గట్టుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఘనవిజయాన్ని కట్టబెట్టాలని ప్రయత్నించారు. ఎంపీటీసీలు, జడ్పీటీసీలతో జోరుగా మంతనాలు జరిపారు. వాళ్లందరినీ చంద్రబాబు దగ్గరకు తీసుకెళ్లి బలాన్ని చాటారు. ఈ పరిణామాలతో భూమాకు మినిస్ట్రీ ఖాయమని ప్రచారం జరిగింది.
రాజకీయ వ్యూహ-ప్రతివ్యూహాల మాట ఎలా ఉన్నా తన ఆరోగ్యాన్ని మాత్రం భూమా నిర్లక్ష్యం చేశారన్నది మాత్రం వాస్తవం. బైపాస్ జరిగిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేదు. విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో ఎక్కువ శ్రమ పడ్డారు. ఇవన్నీ ఆయన గుండెపోటుకు కారణమయ్యాయి. ఒక ప్రజా నాయకుడు దూరం కావాల్సి వచ్చింది. అందుకే ఆళ్లగడ్డ ఇప్పుడు కన్నీరు పెడుతోంది. విగతజీవిగా మారిన భూమాను చూసి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. జోహార్ భూమా నాగిరెడ్డి అంటూ అశ్రునివాళి అర్పిస్తోంది!!!