మోడీ టీంలో తెలంగాణ తేజం!!!

 Posted March 25, 2017

ias chandrakala got place in modi dream team
యూపీలో పొలిటిక‌ల్ లీడ‌ర్స్, కాంట్రాక్ట‌ర్లకు ఎదురొడ్డి ఐఏఎస్ లు ప‌నిచేయాలంటే క‌ష్టం. ఎందుకంటే అక్క‌డ రాజ‌కీయ నాయ‌కులు, మాఫియా డాన్ ల మాటే చెల్లుతుంది. అలాంటి చోట ఓ ఐఏఎస్ స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేసి… గుర్తింపు తెచ్చుకోవాలంటే ఎంతో తెగువ ఉండాలి. అందులోనూ మ‌హిళా ఐఏఎస్ అయితే ప‌రిస్థితి కొంచెం క‌ష్ట‌మే. కానీ ఓ మహిళా ఐఏఎస్ ఆ అనుమానాల‌ను ప‌టాపంచ‌లు చేస్తూ స‌త్తా చాటుతున్నారు. తెలంగాణ‌కు చెందిన ఐఏఎస్ చంద్ర‌క‌ళ అక్క‌డ అక్ర‌మార్కుల తాట తీస్తున్నారు. అందుకే అక్క‌డ ఆమెకు మంచి ఇమేజ్ ఉంది.

యూపీ క్యాడర్ లో ప‌నిచేస్తున్న చంద్ర‌క‌ళ‌ రెండేళ్ల క్రితం.. నాసిరకం రోడ్లేసిన అధికారులపై సీరియ‌స్ అయ్యారు. హిందీలో అనర్గ‌ళంగా మాట్లాడుతూ… కాంట్రాక్ట‌ర్లను క‌డిగి పారేశారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అప్పటి నుంచి ఈమెకు నెటిజన్లతో పాటు ప్రజల సపోర్ట్ వుంది. అటు అత్యుత్తమ ఐఏఎస్ అవార్డును కూడా ఆమె గెలుచుకున్నారు.

చంద్ర‌క‌ళ ఇటీవల బులందర్‌షెహర్, బిజ్నూర్, మీరట్ నగరాల్లో క్లీన్ ఇండియా ప్రచారాన్ని విజయవంతంగా నిర్వహించారు. దీంతో చంద్ర‌క‌ళ స‌మ‌ర్థ‌త ఏంటో ప్ర‌ధాని న‌రేంద్రమోడీ దృష్టికి వెళ్లింద‌ట‌. అందుకే ఆమెకు మోడీ డ్రీం టీమ్ లో స్థానం ద‌క్కింది. ప్ర‌ధాని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ మిషన్‌కు చంద్రకళను డైరక్టర్‌గా నియమించారు. అలాగే మినిస్ట్రీ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ శాఖలోనే ఆమెకు ఉప కార్యదర్శి పగ్గాలు అప్పగించారు.

క‌రీంన‌గ‌ర్ జిల్లాకు చెందిన చంద్ర‌క‌ళ గిరిజ‌న కుటుంబం నుంచి వ‌చ్చారు. ఆమె హైద‌రాబాద్ లో ఉన్న‌త చ‌దువుల‌ను పూర్తి చేశారు. ఐఏఎస్ కావాల‌నుకున్నారు. క‌ష్ట‌ప‌డి సాధించారు. మొత్తానికి యూపీ లాంటి రాష్ట్రంలో ఈ తెలంగాణ తేజం ఇంత మంచి పేరు తెచ్చుకోవడం.. ఇప్పుడు ఏకంగా మోడీ టీంలో స్థానం ద‌క్కించుకోవ‌డం… ఇవ‌న్నీ యువ‌త‌కు స్ఫూర్తినిచ్చే అంశాలే.

SHARE