దేశానికి నాయకుల కరువుందా?

  india need perfect leader cauvery water war karnataka
దేశానికి నాయకుల కరువుందా? ఈ ప్రశ్న అడిగినవారికి పిచ్చి పట్టిందేమో అనుకుంటారు.కానీ కావేరి వివాదం చూశాక ఆ ప్రశ్న సహేతుకమే అనిపిస్తోంది.సమాధానం కూడా నాయకుల కరువుందనే చెప్పాల్సి ఉంటుంది.ఇన్నీ పార్టీలు,ఇందరు నేతల్ని చూస్తూ కూడా ఆ సమాధానమేంటని అనుకోవచ్చు.నాయకత్వమంటే కేవలం పార్టీపరంగానో ,ప్రభుత్వ పరంగానో పదవులు అనుభవించడం మాత్రమే కాదు.

తప్పుదారిలో నడిచే అనుచరుల్ని,సహచరుల్ని,ప్రజల్ని హెచ్చరించి సన్మార్గంలో పెట్టగల సామర్ధ్యం కలిగివుండడం అసలైన నాయకుడి లక్షణం…ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకోవడం మాత్రమే కాదు..ఆ ఆకాంక్షల్లో తప్పుంటే చెప్పడం కూడా నాయకత్వమే.కానీ దురదృష్టవశాత్తు అంత ధైర్యమున్న నాయకులు కనిపించడం లేదు.ఇప్పుడు కావేరి అంశాన్నే తీసుకుందాం….రాజ్యాంగపరమైన అన్ని వ్యవస్థలు …ముఖ్యంగా న్యాయవ్యవస్థ వివాదంపై ఓ తీర్పు ఇచ్చింది..దాని వల్ల కొంత నష్టమున్నా అమలుచేయక తప్పదని కన్నడ ప్రజలకి గట్టిగా చెప్పే నాయకుడే కనిపించడం లేదు.పైగా వారిలో భావోద్వేగాల్ని ఇంకాస్త రెచ్చగొట్టి ఓట్ల పండగ చేసుకోవాలనే నేతలు ఎక్కువయ్యారు.

ఇలాంటి కఠిన సమయాల్లోనూ గాంధీ ఎలా నడుచుకున్నారో తెలుసుకోడానికి సహాయనిరాకరణ ఉద్యమం ఓ ఉదాహరణ.దేశమంతా గాంధీ పిలుపుతో ఉద్యమం ఉద్ధృతంగా ఆడుతున్న రోజులవి ..బ్రిటిష్ వ్యతిరేకత తారాస్థాయికి చేరుకున్న రోజులు ..పరిస్థితులు ఎలా వున్నా శాంతిమార్గం తప్పకూడదని గాంధీ ఉద్బోధిస్తున్న రోజులు..చౌరీచౌరా వద్ద ఉద్యమకారులై కాల్పులు జరగడంతో ఒక్కసారిగా హింస చెలరేగింది .కోపోద్రిక్తులైన ఉద్యమకారులు జరిపిన దాడిలో 22 మంది పోలీసులు చనిపోయారు. గాంధీ చలించిపోయారు.హింసతో ఉద్యమం నడపలేనని ప్రజలకి చెప్పేశారు.ఉవ్వెత్తున సాగుతున్న ఉద్యమాన్ని ఉపసంహరించారు.ఎంత వ్యతిరేకత వచ్చినా తాను నమ్మిన అహింసాపోరాట విధానాలకు కట్టుబడ్డారు.అదే జనానికి చెప్పారు.ఇప్పుడు అలాంటి నేతల్లేరు.జనంతో జై కొట్టించుకునేవాళ్ళు ..ప్రతిదానికి సై అనేవాళ్లే నేతలుగా చెలామణి అయిపోతున్నారు.జనం దారిలోనే వెళ్లడం కాకుండా ..జనాన్ని సరైన దారిలో నడిపించే నాయకులు ఇప్పుడు దేశానికి కావాలి .

SHARE