మూడు రంగుల జెండా ప్రయాణం..అమరవీరులకు ప్రణామం..

 indian national flag journey

స్వాతంత్య్రం సిద్ధించి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది ‘తిరంగా యాత్ర’ పేరిట పెద్ద ఎత్తున స్వాతంత్య్ర వేడుకలను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్న విషయం తెలిసిందే. వారం రోజుల పాటు నిర్వహించనున్న ఈ వేడుకల్లో భాగంగా కేంద్ర మంత్రులు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖ యోధుల జన్మస్థలాలను. సరిహద్దు ఔట్‌పోస్టులను సందర్శించనున్నారు. జాతి మరిచిపోయిన లేదా తెలియని హీరోల గురించి అవగాహనను తీసుకురావడం ఈ వేడుకల ప్రధాన ఉద్దేశం.

ఈ కార్యక్రమంలో భాగంగా మహిళా మంత్రులు ఉమా భారతి, హర్ సిమ్రత్ కౌర్, స్మృతి ఇరానీలు సరిహద్దు ప్రాంతాలను సందర్శించి జవాన్లకు రాఖీలు కడతారు. అలాగే ప్రముఖ సినీ నేపథ్య గాయకులు ఆశాభోంస్లే, కుమార్ సాను, మనోజ్ తివారీలు పారా మిలటరీ బలగాలు ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు. గత వారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రముఖ స్వాతంత్య్ర యోధుడు చంద్రశేఖర్ ఆజాద్ జన్మించిన మధ్యప్రదేశ్‌లోని భభ్రాను, ముంబయిలోని ఆగస్ట్ క్రాంతి మైదాన్‌ను సందర్శించిన విషయాన్ని నాయుడు గుర్తు చేశారు.

హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్వాతంత్య్ర యోధులు అష్ఫక్ అలీ, రామ్‌ప్రసాద్ బిస్మిల్‌లతో ముడిపడిన యుపిలోని షాజహాన్‌పూర్‌ను సందర్శిస్తారు. అలాగే ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పంజాబ్‌లోని జలియన్‌వాలాబాగ్, జమ్మూ, కాశ్మీర్‌లోని హీరానగర్‌ను సందర్శిస్తారు. రైల్వే మంత్రి సురేశ్ ప్రభు గుజరాత్‌లోని దండి ఆశ్రమాన్ని సందర్శిస్తే, శాస్త్ర, సాంకేతిక వ్యవసారాల మంత్రి హర్షవర్ధన్ మహాత్మాగాంధీ జన్మస్థలమైన పోరుబందర్ వెళ్తారు. ఆకాశవాణి, దూరదర్శన్, ఎఫ్‌ఎం రేడియోలలో స్వాతంత్య్ర యోధులపై వివిధ కార్యక్రమాలను కూడా ప్రసారం చేస్తారు.

‘తిరంగా యాత్ర’ కోసం గజల్ శ్రీనివాస్ రూపొందించిన ‘తిరంగా యాత్ర’’ థీమ్‌సాంగ్‌ను శుక్రవారం మీడియా సెంటర్‌లో వెంకయ్యనాయుడు విడుదల చేశారు. ఈ థీమ్ సాంగ్‌ను నాలుగు భాషల్లో రూపొందించామని, దేశ స్వాతంత్య్రకోసం జీవితాలను త్యాగం చేసిన మహానుభావులను గుర్తుకు తెచ్చుకొనే అవకాశాన్ని కల్పించాలనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. యువతలో దేశభక్తి, ప్రజల్లో ఐక్యత పెంచడానికే ఈ కార్యక్రమాలని అన్నారు.

SHARE