ఇంటర్నెట్‌ తో నడిచే కారు…

internet car hyderabad
టెక్నాలజీకి ఇంటర్నెట్‌ తోడవడంతో సాంకేతికత కొత్తపుంతలు తొక్కుతోంది. సరికొత్త ఆవిష్కరణల నెలవుగా మారింది. 3డి అవయవాలకు స్పర్శను, రోబోలకు స్పందనలను కలిగించడమే కాకుండా ఇంటర్నెట్‌ సాయంతో నడిచే కార్లను కూడా రూపొందిస్తున్నారు. నిన్నామొన్నటి వరకు యంత్రాలను తయారు చేసిన మనిషి… ఇప్పుడు తన తెలివితేటలను ఆ యంత్రాలలోకి చొప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటివరకూ కారులో ఇంటర్నెట్‌ ఉండేది… కాని ఇప్పుడు ఇంటర్నెట్‌తో నడిచే కారునే తయారు చేశారు. స్మార్ట్‌ఫోన్ల రాకతో స్మార్ట్‌గా మారిన మనిషి జీవితాన్ని ఈ సరికొత్త సాంకేతికత మరింత స్మార్ట్‌గా మార్చనుంది. చైనా టెక్‌ దిగ్గజం అలీబాబా గ్రూప్‌ ఇంటర్నెట్‌ సహాయంతో నడిచే కారును రూపొందించింది. ఇప్పటికే కొన్ని కార్లకు ఇంటర్నెట్‌ అందుబాటులో ఉన్నప్పటికీ… వాటికి వైఫై, జిపిఎస్‌ లను ఉపయోగించుకొనే వెసులుబాటు మాత్రమే ఉండేది. ఈ కారును ఆలీబాబా సంస్థ ఎస్సేఐసీ మోటార్‌ కార్పొరేషన్‌తో కలసి రూపొందించింది. స్మార్ట్‌ఫోన్‌, కంప్యూటర్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఆధారంగా ఎలా పనిచేస్తాయో… అదే మాదిరిగా ఈ కారుకు కూడా వెబ్‌ ఆధారిత ఆపరేటింగ్‌ సిస్టం ఉంటుంది.

ఈ సరికొత్త ఆపరేటింగ్‌ సిస్టం యూన్ ఓఎస్ ను ప్రత్యేకంగా దీనికోసం తయారుచేశారు. ప్రతిష్టాత్మకమైన ఈ ఆరెక్స్ 5 ఎస్యూవీ కారును తయారు చేయడానికి ఈ రెండు కంపెనీలు గత రెండేళ్లుగా కృషి చేస్తున్నాయి. సాధారణ వాహనాల మాదిరిగా కాకుండా… డేటా స్ట్రీమింగ్‌, మోడలింగ్‌, రిపోర్టింగ్‌ తదితర సాంకేతికాంశాలతో కూడిన వెబ్‌ ఆధారిత ప్లాట్‌ఫాం ఈ కారులో ఉంటుంది. వైఫై, జిపిఎస్‌ సహాయం లేకుండా… ఇంటర్నెట్‌ ఆధారంగా బవూ ఆపరేటింగ్‌ సిస్టం అందించే మ్యాప్‌ సహాయంతో గమ్యాన్ని చేరుకోవచ్చు. ఈ మ్యాప్‌ను ఇంటర్నెట్‌ ఐడి లేదా డ్రైవర్‌ దగ్గరుండే స్మార్ట్‌ఫోన్‌ లేదా స్మార్ట్‌వాచ్‌కు కనెక్టయి వుంటుంది. తద్వారా సులభంగా డ్రైవర్‌ను గుర్తించే అవకాశం వుంటుంది. ఇటువంటి అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన మొట్టమొదటి కారు ఇదే.

ఈ కారులో మొత్తం ప్రయాణాన్ని 360 డిగ్రీలు వీడియో రికార్డింగ్‌ చేసేలా ఈ కారుకు నాలుగు కెమెరాలు, ఒక పెద్ద టచ్‌ స్క్రీన్‌, ఎల్యీడీ డాష్‌ బోర్డు, ఇంటెలిజెన్స్‌ రేర్‌ వ్యూ అద్దం వంటి ఫీచర్స్‌ను అమర్చారు. దీనికి అమర్చిన టచ్‌ స్క్రీన్‌ కూడా యూన్ ఓఎస్ ఆపరేటింగ్‌ సిస్టంపైనే ఆధారపడి పని చేస్తుంది. మనం సష్టించింది కారులో ఉండే ఇంటర్నెట్‌ను కాదు… ఇంటర్నెట్‌తో నడిచే కారును. ఆటోమొబైల్‌ పరిశ్రమలో ఇదొక మైలురాయి. కారులకు స్మార్ట్‌ ఆపరేటింగ్‌ సిస్టం రెండో ఇంజన్‌ గానూ, డేటా సరికొత్త ఇంధనం గానూ మారింది. ఈ కారు ద్వారా ప్రపంచానికి మనం దిక్సూచిగా మారనున్నామని ఆలీబాబా గ్రూప్స్‌ సాంకేతిక స్టీరింగ్‌ కమిటీ చైర్మన్‌ వాంగ్‌ జియాన్‌ అంటున్నారు. జూలై 20-31 తేదీల మధ్య జరిగే ఆలీబాబా ఆటోమోటివ్‌ ఫెస్టివల్‌లో ఈ ఆరెక్స్ 5 ఎస్యూవీ కారును ఆవిష్కరించనున్నారు. కాగా, అమ్మకాలు మాత్రం ఆగస్టు నుంచి జరిగే అవకాశం వుంది. దీని ధర భారత కరెన్సీలో రూ.13,25,116 – 25,26,064 ల మధ్య ఉండే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here