అధికారమే అస్త్రం..అదే ఆమె లక్ష్యం

0
521

   irom sharmila goal become minister

ఉక్కు మహిళ అంటే ఈవిడే అంటే నమ్మశక్యం కాని రూపం. ఆమె సంకల్పం ఆమెను ఉక్కు మహిళగా మార్చింది. ఆమె చేపట్టిన సత్యాగ్రహం మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరినీ కదిలించింది. దశాబ్దాల తరబడి దౌర్జన్యానికి గురవుతున్న తమ జాతిని కాపాడేందుకు, మానవత్వం లోపించిన చట్టాన్ని ఎత్తేసేందుకు ఆమె తిరుగులేని దీక్షకు పూనుకున్నారు. 16 ఏళ్లపాటు ఎన్ని అవాంతరాలు ఎదురైనా కొనసాగించారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా తల వంచలేదు. బెదిరింపులకు లొంగలేదు.

ఈశాన్య భారతంలోని మణిపూర్ రాష్ట్రానికి చెందిన ఇరోం షర్మిల తమ రాష్ట్రం నుంచి సైనిక బలగాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని ఎత్తేయాలన్న కృత నిశ్చయంతో 16 ఏళ్ల క్రితం అంటే సరిగ్గా 2000 సంవత్సతరం నవంబరు 5 న దీక్ష బూనారు.

ఆమ్ డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ యాక్ట్ ను రద్దు చేయాలనేది ఆమె డిమాండ్. ఇది ఆమె ఒక్కరి మాటే కాదు. యావత్ మణిపురిల బాధ. అందుకే అందరి తరఫున పోరాటానికి దిగారు. శాంతి భద్రతలు అదుపులో లేని రాష్ట్రాల్లో ఆర్మీకి ప్రత్యేక అధికారాలను ఇవ్వడానికి భారత ప్రభుత్వం 1958లో ఈ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం అమలులో ఉన్న సమయంలో సైన్యానికి అపరిమిత అధికారాలను అందజేసింది. ప్రశ్నించలేని అధికారం ఎక్కడ ఉన్నా, ఎవరికి ఉన్నా దాని వల్ల సమాజానికి అనర్థాలు తప్పవన్నది చరిత్ర చెబుతున్న సత్యం. మణిపూర్ లోనూ ఇలాంటి అరాచకాలే జరిగాయి. అందుకే షర్మిల పోరాటానికి దిగింది.

చట్టాన్ని ఎత్తేసేందుకు ససేమిరా అన్నకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆమెను నిర్బంధించాయి. చికిత్స కోసం తరలించిన ఆసుపత్రినే బందీఖానగా చేశాయి. అక్కడే ఉంచి ఆమెకు బలవంతంగా చికిత్స అందిస్తూ వచ్చాయి.

ఆమె ఆరోగ్యం క్షీణించినప్పుడల్లా ప్రభుత్వం ఆమెకు సెలైన్ ఇస్తూ వచ్చింది. గంటలు, రోజులు, వారాలు, నెలలు, ఏళ్లు గడుస్తుండడంతో ఇక లాభం లేదనుకుంది అక్కరి సర్కారు. ముక్కు ద్వారా పొట్టకు శాశ్వతంగా ఓ పైప్ అమర్చింది. దాని ద్వారా ద్రవరూప ఆహారం అందిస్తూ వచ్చింది.ఇంతకూ మణిపూర్ లో అమలవుతున్న అంత కఠినమైన చట్టమేంటి? దాని వల్ల నష్టమేంటిఅది 2000 సంవత్సరం నవంబర్ 2వ తేదీ. మణిపూర్ రాజధాని ఇంఫాల్‌ విమానాశ్రయానికి సమీపంలో మాలోమ్‌ అనే జనావాసం వద్ద బస్‌స్టాప్‌లో నిలబడి ఉన్న పది మందిని తీవ్రవాదులు అన్న ఆరోపణలతో కాల్చి చంపారు. పారామిలటరీ బలగాల్లో ఒకటైన అస్సాం రైఫిల్స్‌ బృందమే ఈ పనికి పాల్పడదిందన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై సైన్యం నుంచి కాని, ప్రభుత్వం నుంచి కాని కనీస ఖండనలు కూడా వెలువడలేదు సరికదా సమర్థించుకున్నారు. ఆ సంఘటన మణిపురిల్లో ఆగ్రహావేశాలు నింపింది. తమ ప్రాణాలు తీసే చట్టాన్ని తక్షణం ఉసంహరించాలన్న ఆందోళన మొదలైంది.

ఏదైనా చట్టం చేస్తే దాన్నిరద్దు చేయడానికి, ఉపసంహరించుకోవడానికి ఎలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అంగీకరించదు. అందులోను తీవ్రవాదుల ప్రాబల్యం అధికంగా ఉన్నరాష్ట్రంలో అయితే ఇక చెప్పనక్కరలేదు. శాంతిభద్రతల పరిస్థితి అదుపులో ఉన్నా, తీవ్రవాదుల ప్రభావం తగ్గినా చేసిన చట్టాన్ని కొనసాగించడమే తప్ప దాన్ని రద్దు చేయడమో , ఉపసంహరింప చేయడానికో అంగీకరించదు.మణిపూర్ లోనూ ఇదే జరిగింది. అక్కడ కొన్ని దశాబ్దాలుగా ఈ కర్కష చట్టం అమలవుతోంది. అదే సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం. దీని ప్రకారం ఎటువంటి వారెంట్ లేకుండా అరెస్ట్ చేసి నిర్బంధించవచ్చు.

పెద్దగా అనుమతులేవీ లేకుండానే కాల్చి పారేయొచ్చు. తీవ్రవాదిగా అనుమానించామని చెబితే చాలు. పోలీసులు, ఆర్మీకి సహజంగానే ఉన్న ఆయుధాలు, అధికారంతో చెలరేగిపోతున్నారు. అదే తరుణంలో ప్రశ్నించడానికి వీల్లేని అధికారాలు ఉంటే… అరాచకం తప్పదు. ఇంఫాల్‌ విమానాశ్రయానికి సమీపంలోని మాలోమ్‌ వద్ద 10 మంది అమాయకులను పారామిలటరీ బలగాలు కాల్చి చంపడంపై వెల్లువెత్తిన వ్యతిరేకతతో ఇరోం షర్మిల దీక్ష 2వేల సంవత్సరం నవంబరు 5న ప్రారంభమైంది. అప్పటి వరకు ఆమె సామాన్య యువతే. దీక్షకు కూర్చున్నప్పుడు కూడా అంతా తేలికగా తీసిపారేశారు. ఈ ఘటనతో కలత చెందారు షర్మిల. 2004లో జరిగిన మరో ఘటన కూడా షర్మిల సంకల్పాన్ని మరింత కఠినం చేసింది. మనోరమ తంఙం అనే యువతిని అస్సాం రైఫిల్స్ అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి.

దీనికి నిరసనగా ఎంతోమంది మహిళలు పూర్తి వివస్త్రలై ఇంఫాల్ లోని కంగ్లా ఫోర్ట్ వద్ద ప్రదర్శన నిర్వహించారు. తామంతా మనోరమ తల్లులం అంటూ నినదించారు. మణిపురి సమాజంలో తల్లి అంటే రోజు వారీ వ్యవహారాలు నడిపిస్తూనే అణచివేతను నిర్భయంగా ప్రతిఘటించేసాహసత్వానికి మారుపేరు. అన్యాయానికి వ్యతిరేకంగా జరిగిన ఈ నిరసనల అల్లికలో షర్మిల కాలాతీత స్థానాన్ని త్వరితగతిన సంపాదించారు. షర్మిల దీక్షకు ఎంత లేదన్నా ప్రభుత్వాలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి – మచ్చుకు, కంగ్లా ఫోర్ట్ నుంచి అస్సాం రైఫిల్స్ ను ఉపసంహరించారు. ఇంఫాల్ లో కొన్ని చోట్ల చట్టాన్ని ఎత్తేశారు. మొత్తంగా చూస్తే, షర్మిల పట్టు విడవని చైతన్యయుత నిరసనోద్యమంతో వెంట పడుతున్నా ఆ చట్టం మాత్రం కొనసాగింది.

ప్రత్యేక చట్టాన్ని ఉపసంహరించే వరకు అన్నం ముట్టనని, తల దువ్వనని ప్రతిజ్ఞ చేశారు. ఆ రోజు నుంచి దీక్ష విరమించే 2016 సంవత్సరం ఆగస్ట్ 9 వరకు కట్టుబడి ఉన్నారు.అధికారంలో ఉన్న వారికి సామాన్యుల బాధలు పట్టవు. అందుకే ఇరో షర్మిల దీక్ష వారిని కదిలించలేకపోయింది. కాంగ్రెస్ కావొచ్చు. బీజేపీ కావొచ్చు. విపక్షంలో ఒక మాట, అధికారంలోకి వచ్చాక మరోబాట. మణిపూర్ విషయంలోనూ అదే జరిగింది. అందుకే షర్మిల త్రిపుర బాట ఎంచుకున్నారు. 1997లో ప్రవేశపెట్టిన వివాదాస్పద సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని త్రిపుర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ మేరకు త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ తన కేబినెట్ సహచరులను ఒప్పించారు.

ఊరకనే ఈ నిర్ణయం తీసుకోలేదు నృపేన్ సర్కారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పరిస్థితిని ఆరునెలలకు ఒకసారి సమీక్షించారు. ఆ తర్వాతే ఏం చేయాలో నిర్ణయించుకున్నారు. అంతేకాదు. త్రిపురలో పనిచేస్తున్న ఆ రాష్ట్ర పోలీసులు, మిగిలిన సెక్యూరిటీ వర్గాలతో చర్చించారు మాణిక్ సర్కార్. వారి సలహా మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. తమ రాష్ట్రంలో శాంతియుత వాతావరణం నెలకొందనీ, ఇక సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం అమలు ఎంతమాత్రం అవసరం లేదని భావించినట్లు హోం శాఖను స్వయంగా నిర్వహిస్తున్న త్రిపుర సీఎం వెల్లడించారు.ఈ మేరకు త్రిపుర అసెంబ్లీ కూడా తీర్మానాన్ని ఆమోదించింది. కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. తొలుత కేంద్రం ఒప్పుకోలేదు. మరోసారి ఆలోచించాలని సూచించింది. అయినా సమాజ శ్రేయస్సే ధ్యేయంగా మాణిక్ సర్కార్ మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. పైగా తమ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిని గణాంకాలతోసహా వివరించారు. ఇక ఎంతమాత్రం అపరిమిత అధికారాల చట్టం అవసరం లేదని ఒప్పించారు. ఇదే అంశం షర్మిలను ఆకర్షించింది. తమ రాష్ట్రంలోనూ సదరు చట్టం పీడ విరగడ కావాలంటే ఏం చేయాలో బోధ పడింది.

Leave a Reply