Posted [relativedate]
రా ..రా అంటూ రాజకీయ రంగం ఎన్నిసార్లు పిలిచినా నో నో అంటూ తప్పుకుంటున్న రజని మనసు మారిందా.కమల్ దూకుడు చూసి ఆయనకి కూడా రాజకీయం మీద మనసు పీకిందా ? పరిస్థితులు,పరిణామాలు అలాగే కనిపిస్తున్నాయి..ఆ డౌట్ ఎందుకు వచ్చిందో చూడాలంటే ఆర్కే నగర్ ఉప ఎన్నిక చిత్రాన్ని చూడాల్సిందే..
తమిళనాడు రాజకీయాలు అంతకంతకూ సంక్లిష్టంగా మారుతున్నాయి.జయ మరణం తర్వాత అన్నాడీఎంకేలో చీలికలుపేలికలు వచ్చిన విషయం తెలిసిందే.అమ్మ వారసత్వాన్ని క్లెయిమ్ చేసుకోడానికి అందరికీ ఆమె ప్రాతినిధ్యం వహించిన ఆర్కే నగర్ ఉపఎన్నిక పెద్ద అవకాశంగా కనిపిస్తోంది.అక్కడ పాగా వేసినవాళ్ళకి అనధికారికంగా అమ్మ వారసత్వం వచ్చినట్టేననిపిస్తోంది. అందుకే అన్నాడీఎంకే,పన్నీర్ సెల్వం వర్గం,జయ మేనకోడలు దీప ఉపఎన్నికల్లో గెలిచేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు.ఈ ముగ్గురిలో ఆర్కే నగర్ ఉప ఎన్నిక లో ఎవరు గెలిచినా ప్రభుత్వానికి వచ్చే ఇబ్బంది లేకపోయినా నైతికంగా విజయం సాధించినవాళ్లు అవుతారు.ఈ ముగ్గురి మధ్య పోటీని ఓ ఛాన్స్ గా మలుచుకుని విజయం కోసం డీఎంకే ప్రయత్నిస్తున్నా స్థానికంగా ఆ పార్టీ బలం అంతంత మాత్రమే..తమిళనాట ఫ్రంట్ రన్నర్స్ గా పార్టీల పరిస్థితి ఇలా ఉంటే జయ మరణం తర్వాత రాజకీయంగా రాష్ట్రం మీద పట్టు బిగించాలని చూసి విఫలమైన బీజేపీ కూడా ఈ ఉప ఎన్నికను ఇంకో ఛాన్స్ గా తీసుకుంది.
ముందుగా ఇక్కడ కమల్ మాజీ సహచరి గౌతమి అభ్యర్థి అవుతారు అనుకున్నా చివరిలో సీన్ మారిపోయింది.ఇళయరాజా సోదరుడు,సంగీత దర్శకుడు గంగై అమరన్ ని ఆర్కే నగర్ ఉప ఎన్నికల బరిలోకి దించింది.ఆయన ఇప్పుడు స్వయంగా రజని ని కలవడం,చిరు నవ్వులు చిందిస్తూ ఫోటోలు దిగడం,ఉప ఎన్నిక ఉందని తెలిసి కూడా ఆ ఫోటో బయటికి రావడం చూసి తమిళనాట సరికొత్త ఊహాగానాలు ఊపందుకున్నాయి.అదే …రజని బీజేపీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా అని ..ఎప్పటిలాగా రజని వెంటనే ఖండిస్తూ ప్రకటన ఇస్తే సరి..లేదంటే ఫాన్స్ కి ఓ సంకేతం ఇవ్వడానికే అమరన్ తో రజని భేటీ అయినట్టు అనుమానించాల్సి వస్తుంది.