Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విటర్ అకౌంట్ కాస్త ఫిర్యాదుల బాక్సుగా మారిపోయిందట. మొదట్లో తన పర్యటన వివరాలను అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియచెప్పేందుకు వారధిగా కేటీఆర్ ట్విటర్ అకౌంట్ ను వాడుకునే వారు. రానురాను ఇది కాస్త సమస్యల పరిష్కార వేదికగా తయారైంది. నెటిజన్లు ఎలాంటి అభ్యర్థనలు పంపినా సూచనలు చేసినా మంత్రి తక్షణమే స్పందించి సంబంధిత అధి కారులకు ఆ సమాచారాన్ని పంపించి పరిష్కరించాలని ఆదేశిస్తున్నారు. దీంతో ఐటీ మంత్రి అంటే అలాగే ఉండాలని… టెక్నాలజీ విషయంలో ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ టెక్నాలజీని ప్రజోపయోగ పనుల కోసం ఎలా ఉపయోగించాలో కేటీఆర్ చేసి చూపిస్తున్నారని అంటున్నారు.
సోషల్ మీడియాను ఇంతలా ప్రజల మంచి కోసం వాడొచ్చని చూపిన మంత్రి కేటీఆరేనని చెబుతున్నారు. ఇతర రాష్ర్టాల యువ ఐటీ మంత్రులు కూడా ఇలాంటి విధానాలు ఫాలో కావాలని సూచిస్తున్నారు. నాలుగు రోజుల కిందట వర్షం కురిసినప్పుడు నగరంలో ఎక్కడ సమస్య ఉత్పన్నమైందో వర్షపునీళ్ళు ఎక్కడ నిలిచాయో చెట్లు ఎక్కడ పడిపోయాయో తెలియజేస్తూ నెటిజన్లు క్షణంక్షణం కేటీఆర్ కు సమాచారాన్ని పంపించారు.
తన కు వచ్చిన ప్రతి సందేశాన్ని స్వీకరించిన కేటీఆర్ వాటన్నింటిని జీహెచ్ ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డికి పంపించడం తో పాటు వెంటనే సమస్యను పరిష్కరించాలని ఆదే శించారు. అలా మంగళవారం ఒక్కరోజే కేటీఆర్ ట్విటర్ ఖాతాకు వేలాది ఫిర్యాదులు అందాయి. అందులో ఒక్క దాన్ని కూడా విస్మరించకుండా అన్నింటికి బదులిచ్చారు. ఆయా సమస్యలకు సంబంధించిన అధికారులను అప్రమత్తం చేశారు. హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని 31 జిల్లాల్లో ఎక్కడి నుంచి ఎవరు ఏ సమస్య పంపినా ఆయన పరిష్కరిస్తున్నారని చెబుతున్నారు. తాను ఆన్లైన్లో ఉండడమే కాకుండా జీహెచ్ ఎంసీ – ఎలక్ట్రిసిటీ బోర్డు – సీవరేజ్ – హెచ్ ఎండీఎ విభాగాలను ఆన్ లైన్ లో ఉండేలా అప్రమత్తం చేస్తున్నారు.