కెసిఆర్ భజన లో జానా..

  jaanaareddy praise kcrకాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, ప్రతిపక్ష నాయ‌కుడు జానారెడ్డి మ‌రోమారు తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఆకాశానికి ఎత్తేశారు. అయితే పూర్తిగా ప్ర‌శంసించ‌కుండా చివ‌ర్లో హెచ్చ‌రిక‌లు చేసిన త‌న‌దైన శైలిని చాటుకున్నారు. మీడియా స‌మావేశంలో కాకుండా సీఎల్పీ కార్యాలయంలో విలేక‌రుల‌తో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఈ మేర‌కు స్పందించడం విశేషం. మాఫియా డాన్‌ నయీంను ప్రభుత్వం మట్టుబెట్టడంతో పౌర సమాజానికి మేలు జరిగిందని జానా కితాబిచ్చారు.

కాంగ్రెస్‌ హయాంలో నయీం కదలికలపై నిఘా వేసి, అరెస్టు చేయాలని ప్రయత్నించినా ఆయ‌న జాడ చిక్కడం లేదని అధికారులు చెప్పేవారని వివరించారు. ఈ విషయంపై మాజీ డీజీపీ అరవిందరావును వివరణ అడగవచ్చనన్నారు.కాంగ్రెస్‌ హయాంలో న‌యీంను అరెస్టు చేయడంలో కొంత జాప్యం జరిగిన విషయం నిజమేనని జానారెడ్డి అంగీక‌రించారు. హోంమంత్రిగా ఉన్న సమయంలో నయీంను అరెస్టు చేయాలని అధికారులను ఆదేశించానని అయితే ఆ సమయంలో సాధ్యం కాలేదన్నారు. ఇప్పటికీ సాధ్యమైందని, ప్రజలకు ఎంతో మేలు జరిగిందన్నారు.

తాను హోంమంత్రిగా ఉన్న సమయంలో బాధితులు ఎవ్వ‌రి నుంచి ఫిర్యాదులు అందలేదని జానా చెప్పారు. పదవి నుంచి దిగిపోయిన తర్వాత కొంత మంది నయీం ఆగడాలపై తనకు ఫిర్యాదు చేశారని చెప్పారు. అధికారంలో ఉన్న సమయంలో నయీంను ఉపయోగించుకున్నారా! అన్న ప్రశ్నకు తాను ఆ స్థాయికి దిగజారలేదని, నన్ను ఏనాడూ అతను బెదిరించలేదని, తాను ఎవరికీ భయపడే వ్యక్తిని కాదని జానా రెడ్డి అన్నారు.

ఇదిలా ఉండగా టీపీసీసీ పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్ సమయంలో గైర్హాజ‌రీపై విలేక‌రులు ప్రశ్నించ‌గా… పార్టీ నిర్ణయం మేరకే జరిగిందని, తన సూచనలు, సలహాలు అందులో ఉన్నాయని జానా రెడ్డి తెలిపారు. ప్రజెంటేషన్‌ ఇచ్చే వ్యక్తి ఉంటే సరిపోతుందని, తాను లేకపోతేనేమి అని ప్రశ్నించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ముందుకు ఐదు రూపాయలకు భోజనం తిని టీఆర్‌ఎస్‌ గెలుపునకు సహకరించారన్న ప్రశ్నకు జానా ఆస‌క్తిక‌రంగా స్పందించారు. జర్నలిస్టుల కోరికమేరకు అలా చేశానన్నారు. ఒక టీమ్‌ లీడర్‌గా ఉంటూ అధికార పార్టీని ఎలా మెచ్చుకుంటానని ఎదురు ప్రశ్నించారు. ఈ ప్రభుత్వంపై ప్రజల్లో రోజురోజుకు వ్యతిరేకత పెరుగుతోందన్నారు. ప్రభుత్వంపై తిరుగుబాటు చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని జానా రెడ్డి చెప్పారు.

SHARE