టీజేఏసీ కోటకు బీటలు!!

Posted [relativedate]

jac leaders open letter to kodandaram
తెలంగాణ జేఏసీ కోట బీటలు వారుతోంది. ఛైర్మన్ కోదండరాంపై జేఏసీ సభ్యులు తిరుగుబాటు మొదలుపెట్టారు. రాజకీయ ఎజెండాతో ముందుకు సాగుతున్నారంటూ వారంతా ఆయన తీరును కడిగిపారేస్తున్నారు. ఇంతకుముందు లేఖాస్త్రం సంధించినా… ప్రొఫెసర్ గారు స్పందించకపోవడంతో.. ఇప్పుడు బహిరంగ లేఖతో మరోసారి నిప్పులు చెరిగారు.

హైదరాబాద్ లోని అశోక్ హోటల్లో టీ జేఏసీ కో చైర్మన్ ప్రహ్లాద్ అధ్యక్షతన టీ జేఏసీ సమావేశమైంది. వివిధ జిల్లాలకు చెందిన 22 మంది ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. గతంలో రాసిన అంతర్గత లేఖలో వ్యక్తం చేసిన అంశాలపై సమావేశం నిర్వహించి.. ప్రజలకు కోదండరాం జవాబు చెప్పాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. టీ-జేఏసీ రాజకీయ పార్టీగా మారదంటూనే.. తెలంగాణకు మరొక రాజకీయ పార్టీ అవసరమని ఎందుకు ప్రకటనలు చేస్తున్నారని నిలదీశారు. దీనిపై కోదండరాం కచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

పలు జిల్లాలకు చెందిన నేతలంతా ఈ మీటింగ్ కు తరలిరావడంతో కోదండరాం వర్గం పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయింది. రోజురోజుకు ఈ అసంతృప్తుల సంఖ్య పెరిగిపోవడంతో జేఏసీ ఉనికే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అసంతృప్త వర్గం డిమాండ్ చేస్తున్న ప్రకారం ఇప్పుడు కోదండరాం సమాధానం చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. ఆయన సమాధానం చెప్పినా ఇబ్బందే. చెప్పకపోయినా ఇబ్బందే. అందుకే ఆయన తదుపరి కార్యాచరణ ఎలా ఉంటుందన్నది సస్పెన్స్ గా మారింది.

జేఏసీ సభ్యుల అభ్యంతరాలకు తగ్గట్టే ప్రొఫెసర్ గారి ప్రవర్తన ఉండడాన్ని చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికైనా కోదండరాం తీర్చుకోవాలనే వారి సంఖ్య పెరుగుతోంది. లేకపోతే జేఏసీ కూడా రెండు వర్గాలుగా విడిపోవడం ఖాయం. ఒకప్పుడు కేసీఆర్ తో సమానంగా తెలంగాణ క్రెడిట్ పంచుకున్న కోదండరాం.. ఇప్పుడు ఆ క్రెడిట్ ను పోగొట్టుకునే ప్రమాదముంది!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here