జగన్..పవన్ కాంబినేషన్?

Posted November 13, 2016

pawan-kalyan-jagan-645-31-1459424475 సినిమాల్లో మల్టీ స్టారర్ తీసినంత తేలిగ్గాదు..రాజకీయాల్లో రెండు కత్తులు ఒకే ఒరలో చేరడం. ఒక వేళ రాజకీయ మల్టీ స్టారర్ కాంబినేషన్ లు కుదిరినా వాటిని ఓ సారి సక్సెస్ చేసినా వచ్చిన విజయాన్ని నిలుపుకోవడం అంత తేలిగ్గాదు.అప్పటి జనతా ప్రభుత్వం నుంచి ఇందుకు ఎన్నో ఉదాహరణలు.ఇప్పుడు బీహార్ లో లాలూ తో నితీష్ ఎన్ని పాట్లు పడుతున్నాడో చూస్తూనే వున్నాం.ఇక 2009 లో మహా కూటమి అంటూ బాబు,కెసిఆర్ కలిసి ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నారో తెలిసిందే.ఇన్ని సాక్ష్యాలు కళ్ళ ముందున్నా 2019 లో విజయం పై కన్నేసిన వైసీపీ ఎట్టి పరిస్థితుల్లో ఒక్క అవకాశాన్ని వదులుకోడానికి సిద్ధంగా లేదు.ఆ ఎన్నికల్లో ఓడిపోతే ఆ పార్టీ ఉనికే ప్రమాదంలో పడుతుందన్నది నిజం కూడా.అందుకే జగన్ ఆప్తుడు విజయసాయి రెడ్డి హోదా అంశాన్ని చూపుతూ పదేపదే పవన్ మాతో కలిసి పనిచేయాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.అయితే ఈ కాంబినేషన్ సాధ్యమా?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయంగా తొలి అడుగు వేసినప్పటినుంచి ఒక్కసారి కూడా జగన్ అనుకూల వైఖరి ప్రదర్శించలేదు.నిజంగా పవన్ అధికారం కోసమే పని చేయడం లేదు అంటున్నాడు కాబట్టి ఈ కాంబినేషన్ సెట్ అయితే ఓట్ల పంట పండుతుంది.కానీ ఓ రాజకీయ నేతగా పవన్ సమర్ధత మీద ఇప్పటి దాకా సందేహాలు ఉన్నాయేమో గానీ అయన నిజాయితీ మీద పెద్దగా డౌట్స్ లేవు.ఇప్పుడు జగన్ తో కలిస్తే చాలా విషయాలకి జవాబులు ఇవ్వాల్సి ఉంటుంది.జగన్ తప్పులకి పవన్ సంజాయిషీ ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటారు.పైగా విజయసాయి విజ్ఞాపనలు వల్ల పవన్ ఎటూ రాకపోగా క్షేత్ర స్థాయిలో పోటీ పడే రెండో పార్టీ ముందు వైసీపీ చులకన అవుతుంది.పార్టీ శ్రేణుల మనోభావాలు దెబ్బతినే ప్రమాదముంది.వారి ధైర్యం కూడా సన్నగిల్లుతుంది.రెండేళ్ల తర్వాత వ్యవహారం గురించి ఇప్పుడే పార్టీ శ్రేణుల్ని అయోమయంలో పడేయడం కన్నా సొంత పోరాటాలు చేస్తూనే ఎన్నికల సమయంలో పొత్తుల ఎత్తులు వేయడం వైసీపీ కి మేలు.రాని అతిధిని పదేపదే పిలవడం వల్ల గౌరవం దెబ్బతింటుందని విజయసాయి గుర్తెరిగితే మంచిది.

SHARE