Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గతంలో వైఎస్ జగన్, ప్రత్యేక హోదా కోసం తమ ఎంపీలు రాజీనామా చేయడానికి సిద్ధంగా వున్నారనీ, జూన్లో తమ ఎంపీలు రాజీనామా చేస్తారనీ ప్రకటించిన విషయం విదితమే. బడ్జెట్ సమావేశాల్లో కేంద్రాన్ని ప్రత్యేక హోదాపై నిలదీసి, కేంద్రం నుంచి స్పష్టమైన హామీని రాబడ్తామనీ, అలా రాబట్టలేని పక్షంలో ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసి, ప్రజల్లోకి వెళాతరనీ వైఎస్ జగన్ తెగేసి చెప్పారు. రోజులు మారాయి.. రాజకీయాలూ మారాయి. గతంలోలా ఇప్పుడు వైఎస్ జగన్, బీజేపీకి వ్యతిరేకం కాదు.
పైగా, ఎన్డీయే కూటమికి బయటి నుంచి మద్దతిస్తోన్న వ్యక్తి. అవును, మొన్నీమధ్యనే ప్రధాని నరేంద్రమోడీని కలిసిన తర్వాత, అంశాల వారీగా మద్దతు అనే కొత్త విషయాన్ని తెరపైకి తెచ్చారు వైఎస్ జగన్. ఏమో, అక్కడ మోడీ ఏం మంత్రమేశారోగానీ, రాష్ట్రపతి ఎన్నికలకోసం ఎన్డీయేకి మద్దతిస్తున్నాం.. అని ప్రకటించేశారాయన. చాలా చాలా చిత్రమైన సందర్భమిది. మరి, ఎంపీలతో రాజీనామా చేయిస్తామన్నారు కదా.. అదెప్పుడు.? అన్న ప్రశ్న ఉత్పన్నమవడంతో వైఎస్ జగన్ ఆ ప్రశ్నకీ పై విధంగా క్లారిటీ ఇచ్చేశారు.
అంటే, ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ ఎంపీలు రాజీనామా చేస్తారని గతంలో వైఎస్ జగన్ చేసిన ప్రకటన ఉత్తదేనన్నమాట. తమ ఎంపీ ఒకరు పార్లమెంటులో ప్రైవేటు బిల్లు పెట్టారు గనుక, దానిపై చర్చ జరగాల్సి వుందనీ, ఆ తర్వాత కూడా కేంద్రం మాట వినకపోతే అప్పుడు రాజీనామా చేయడానికి ఎలాగూ అవకాశముందనీ వైఎస్ జగన్ సన్నాయి నొక్కులు నొక్కేశారు. నిన్న మొన్నటిదాకా చంద్రబాబును ఎద్దేవా చేసిన వైసీపీ నేతలు ఇప్పుడేం సమాధానం చెబుతారో.