బాబాయ్ ఓట‌మికి అబ్బాయే కార‌ణ‌మా?

Posted March 22, 2017

jagan is responsible for vivekanandh reddy loosing post
రాష్ట్రంలో అధికారంలోకి రావాల‌ని క‌ల‌లుగంటున్న జ‌గ‌న్ … సొంత‌గ‌డ్డ‌పై బాబాయ్ ఓడిపోవ‌డం పెద్ద షాకే. సొంత సెగ్మెంట్లో స‌రిప‌డా ఓట్లు ఉండి కూడా పరాజ‌యం చెంద‌డం అంటే అది ఘోర ప‌రాభ‌వ‌మే. దీనికి జ‌గ‌న్ స్వ‌యంకృతాప‌రాధ‌మే కార‌ణ‌మ‌న్న వాద‌న వినిపిస్తోంది. అతి విశ్వాస‌మే కొంప‌ముంచిందన్న ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది.

క‌డప జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ తరపున 521 మంది, టీడీపీ తరపున 303 మంది గెలిచారు. దీనికి తోడు డీఎల్ రవీంద్రారెడ్డి లాంటి వారి మ‌ద్ద‌తు ఉంది. దీన్ని బ‌ట్టి చూస్తే.. వైసీపీ విజ‌యం లాంఛ‌న‌మే. క‌డప ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా వైఎస్ వివేకానంద రెడ్డి చాలా సులువుగా గెలిచి ఉండాల్సింది. కానీ అలా జ‌ర‌గ‌లేదు.

ఎన్నిక‌ల‌కు ముందు జ‌గ‌న్ రెండురోజుల పాటు ప‌ర్య‌టించినా… పెద్ద సీరియ‌స్ నెస్ ఆయ‌న‌లో క‌నిపించ‌లేద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఏదో నామ‌మాత్రంగా మాట్లాడార‌ట‌. గెలుస్తార‌న్న ధీమాలో…. స్థానిక లీడ‌ర్ల‌తో ముక్తస‌రిగానే మాట్లాడారట‌. అంతే కానీ టీడీపీ నుంచి ఆఫ‌ర్లు వ‌చ్చినా… గ‌ట్టిగా నిల‌వాల‌న్న ధైర్యాన్ని మాత్రం ఇవ్వ‌లేక‌పోయార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

టీడీపీ వ్యూహాలను జ‌గ‌న్ వ‌ర్గం ప‌సిగ‌ట్ట‌లేక‌పోయింది. వైసీపీ అధినేత సొంత‌గ‌డ్డ‌పై టీడీపీకి అంత సీన్ లేద‌ని అనుకున్నారు. కానీ అధికార‌ప‌క్షం క్రాస్ ఓటింగ్ చేస్తే ప‌రిస్థితి ఏంట‌న్న‌ది అంచ‌నా వేయ‌లేక‌పోయారు. నిజంగా వైసీపీ చీఫ్ గ‌ట్టిగా ప్ర‌జాప్ర‌తినిధులందితోనూ మాట్లాడి ఉంటే క్రాస్ ఓటింగ్ కు అవ‌కాశమే లేక‌పోయేది. ముఖ్యంగా జ‌మ్మ‌ల‌మ‌డుగు, ప్రొద్దుటూరులను లైట్ తీసుకోవ‌డం కూడా ఓట‌మికి కార‌ణ‌మైంద‌ని టాక్. మొత్తానికి జ‌గ‌న్ వ‌ల్లే బాబాయ్ ప‌రాజ‌యం పాల‌య్యార‌న్న‌ ప్ర‌చారం ఇప్పుడు జోరుగా సాగుతోంది. అబ్బాయ్ నిర్ల‌క్ష్యమే పెద్దాయ‌న ఓట‌మికి కార‌ణ‌మైంద‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

SHARE