అన్నిటికీ అదే మార్గం ..జగన్

 jagan meet cpi leader d.raja special status

ఆంధ్రకు ప్రత్యేక హోదా వచ్చే వరకు వెనక్కి తగ్గేదేలేదని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. కీలకమైన వస్తుసేవల పన్ను(జీఎస్టీ) బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశం అత్యావశ్యకంగా మారిందని జగన్ అన్నారు. త్వరలో చట్టంగా మారబోయే జీఎస్టీ వల్ల.. అమ్మకం పన్ను ప్రోత్సాహకాలు(సేల్స్ ట్యాక్స్ ఇన్సెంటివ్స్) కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లిపోతాయని, తద్వారా మౌలిక వసతులు లేని ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు క్షీణిస్తాయని చెప్పారు. అందుకే రాష్ట్రాన్ని బతికించాలంటే ప్రత్యేక హోదా ఇవ్వక తప్పదని, ఆమేరకు పోరాటాలు కొనసాగిస్తామని ఆయన అన్నారు.

ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీకి హోదా అంశంపై రాజ్యాంగ పెద్దలతోపాటు పలు పార్టీల ముఖ్యనేతల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. జగన్ సీపీఐ జాతీయ నేత డి. రాజాను కలుసుకున్నారు. ఇన్నాళ్లూ పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్రాలు.. సేల్స్ ట్యాక్స్ మినహాయింపు తదితర ప్రోత్సాహకాలు ప్రకటించేవి. జీఎస్టీ బిల్లుతో ఇప్పుడా(ఇన్సెంటివ్స్) వ్యవహారం కేంద్రం చేతుల్లోకి పోయింది.

అసలే మౌలిక వసుతుల లేమితో కొట్టుమిట్టాడుతున్న ఏపీకి ఇక పెట్టుబడులు మృగ్యం అవుతాయి. ఇప్పుడున్న నిరుద్యోగ సమస్య ఇంకా పెరిగిపోతుంది. ఈ విపత్కర సమస్యలన్నింటికి ఒక్కటే పరిష్కారం.. అదే ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా లభిస్తే పన్ను రాయితీ ప్రోత్సాహకాల్లో మనకు వెసులుబాటు దొరుకుతుందని… అప్పుడు ఏపీకి పెట్టుబడులు ధారాళంగా వస్తాయన్నారు. పరిశ్రమలు పుట్టుకొస్తాయి. యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభిస్తాయని వైఎస్ జగన్ అన్నారు.

SHARE