పత్తి మిర్చి రైతులను ఆదుకోండి… జగన్

 jagan said justice flood affected farmers

వరద ప్రభావిత ప్రాంతాల్లో  ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. సోమవారం ఆయన గుంటూరు జిల్లా ముత్యాలంపాడులో వరద వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించి, రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వరద కారణంగా దెబ్బతిన్న పత్తి పంటను వైఎస్ జగన్ పరిశీలించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ…వరుసగా వర్షాలు పడ్డాయని, పత్తి, మిరప పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. దాదాపు రెండు లక్షల ఎకరాల పంటకు నష్టం వాటిల్లిందన్నారు. కౌలు రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు.

వర్షాలు, వరదలతో రైతుల దారుణంగా దెబ్బతింటే… ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం పైపైన పరిశీలించి వెళ్లిపోయారన్నారు. జూలై చివరి నుంచి ఆగస్ట్ చివర వరకూ వర్షాలు పడలేదని, అప్పుడు చచ్చిచెడీ రైతులు పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తే… ఈ రెండు నెలలు వర్షాలు ముంచెత్తాయన్నారు. చేతికి వస్తుందనుకున్న పంట చివరికి వరుణుడి పాలైందన్నారు.  గత ఏడాది ఇన్ఫుట్ సబ్సిడీ కూడా ఇంతవరకూ రైతులకు అందలేదన్నారు. రైతుకు రూపాయి చేతికి అందలేదని వైఎస్ జగన్ అన్నారు.

ఓ పక్క రుణాలు మాఫీ కాక, మరోవైపు కొత్త రుణాల కోసం  రైతులు బ్యాంకులకు వెళితే మంజూరు కానీ పరిస్థితి నెలకొందన్నారు. పైగా బంగారంపై రుణాలు ఇవ్వొద్దని చంద్రబాబే చెపుతున్నారు. బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో రెండు, మూడు రూపాయల వడ్డీకి అప్పులు తెచ్చినా పంట చేతికందని పరిస్థితి నెలకొంది. 

జిల్లాకు 120 కోట్లు ఇన్ఫుట్ సబ్సిడీ ఇవ్వాల్సి ఉందని వైఎస్ జగన్ అన్నారు. రైతులను ఆదుకోవాల్సిన చంద్రబాబు…  విమానాల్లో తిరుగుతూ ఆకాశంలో చక్కెర్లు కొడుతున్నారని, ఇప్పటికైన భూమికి దిగి రైతుల పరిస్థితిని అర్థం చేసుకోవాలన్నారు. ఇక కష్టాల్లో ఉన్న రైతుల వద్దకు వచ్చే నాథుడు కూడా లేడని, కనీసం అధికారి కూడా గ్రామానికి వచ్చిన దాఖలాలు లేవన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని వైఎస్ జగన్ ఈ సందర్భంగా రైతులకు హామీ ఇచ్చారు. నష్ట పోయిన పంట పొలాలను నేరుగా వచ్చి పరిశీలించి.. ప్రభుత్వం ఇప్పటికైనా రైతులకు అండగా నిలవాలన్నారు.

SHARE