సెల్వం వెనుక జైట్లీ!!

Posted February 13, 2017

jaitli to guide selvam
పన్నీర్ సెల్వం వెనక కేంద్రప్రభుత్వమే ఉందన్న వాదన ఉంది. మోడీ అండ చూసుకునే సెల్వం దూకుడు పెంచారని ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే బలహీనుడైన సెల్వం ఇంత తెగించడం అసాధ్యం. తన దగ్గర ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా ఆయన సమరభేరి మోగించారంటే దాని వెనక కేంద్రమే ఉందన్నది శశికళ వర్గీయుల వాదన. ఆ అనుమానాలకు బలం చేకూరుస్తూ.. ఇప్పుడు జైట్లీ పేరు తెరపైకి వచ్చింది. జైట్లీ జోక్యం వల్లే సెల్వం బలపడుతున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది.

కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న జైట్లీకి.. తమిళనాడు విద్యాశాఖ మంత్రి పాండ్యరాజన్ తో సన్నిహిత సంబంధాలున్నాయి. చాలా ఏళ్లుగా వీరి మధ్య ఫ్రెండ్ షిప్ ఉందట. అంతెందుకు గతంలో డీఎంకేలో ఉన్న ఆయన… అన్నాడీఎంకేలో చేరడానికి జైట్లీయే కారణమట. జైట్లీ రికమండేషన్ లో జయ ఆయనను పార్టీ చేర్చుకున్నారని టాక్. ఆ తర్వాత మంత్రి పదవి కూడా జైట్లీ చలవవల్లే సాధ్యమైందని సమాచారం. జయ మరణం తర్వాత పాండ్యరాజన్ శశికళకు అండగా నిలిచారు. ఈమధ్య కాలంలో ఆమెతోనూ ఎక్కువగా ఉన్నారు. ఆయనపై గట్టి నమ్మకంతో చిన్నమ్మ కూడా ఆయనను క్యాంపులో పెట్టలేదు. ఆయన కూడా బహిరంగంగానే శశికి అనుకూలంగా మాట్లాడారు.

పాండ్యరాజన్ – జైట్లీ ఫ్రెండ్ షిప్ సెల్వంకు కూడా తెలుసట. అందుకే సెల్వం వెంటనే కేంద్రానికి విషయాన్ని చేరవేశారట. ఇంకేముంది. జైట్లీ నుంచి పాండ్యరాజన్ కు ఫోన్ వెళ్లింది. వెంటనే సెల్వం వర్గంలోకి వెళ్లిపోవాలని చెప్పారట. దీంతో పాండ్యరాజన్ రాత్రికి రాత్రి యూటర్న్ తీసుకున్నారు. జైట్లీ మాట ప్రకారమే సెల్వం వెంట నడిచారు. అంతేకాదు జైట్లీ మాటను క్యాంపులోకి ఇతర ఎమ్మెల్యేలకు కూడా పాండ్యరాజన్ చేరవేశారట. దీంతో వారికి కూడా సీన్ అర్థమైంది. శశికళ సీఎం కావద్దని కేంద్రప్రభుత్వం చాలా గట్టిగా డిసైడయ్యిందని అర్థమైపోయింది.

మొత్తానికి ఇప్పుడు పాండ్యరాజన్ ఎపిసోడ్ తో ఎమ్మెల్యేలు కూడా పునరాలోచనలో పడ్డారట. కేంద్రం ఇంత వన్ సైడ్ గా సెల్వంకు సపోర్ట్ చేయడంతో ఇక లాభం లేదనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అందుకే సెల్వం క్యాంపులో ఎమ్మెల్యేలు పెరుగుతున్నారు. మరి సెల్వంకు మోడీ సర్కార్ సపోర్ట్ ఎప్పటివరకు ఉంటుందో కాలమే నిర్ణయించాలి!!

SHARE