ఊరించి వుసూరనిపించిన కేంద్రం …

  jaitly said about ap package details
ప్రత్యేక హోదా డిమాండ్ ని దీటుగా ఎదుర్కొనే ప్యాకేజ్ అంటూ నానా హంగామా చేసిన కేంద్రం చివరికి ఆంధ్రుల్ని మరోసారి ఊరించి వుసూరనిపించింది.ఒక్క పోలవరం విషయంలో తప్ప మిగిలిన అన్ని విషయాల్లో చూస్తాం,చేస్తాం అంటూ నాటి రాజ్యసభ ప్రకటనను గుర్తుకు తెచ్చారు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ .ఎక్కడా అంకెల ప్రస్తావన రాకుండా పాత హామీలన్నింటినీ మరోసారి నెరవేరుస్తామని మాత్రమే చెప్పి హడావిడిగా ప్రెస్ మీట్ ముగించారు.అంతకన్నా ఓ ప్రెస్ నోట్ పంపి ఉంటే బాగుండేది .ఇంత కీలక అంశంలో అంత తేలిగ్గా మాట్లాడొచ్చని జైట్లీ రుజువు చేశారు.ఆంధ్రపై వున్న చులకన భావాన్ని మరోసారి బయటపెట్టారు.ఈ మొత్తం వ్యవహారానికి ఇంకాస్త కొనసాగింపు ఉందంటూ జైట్లీ చెప్పినా ఈసారి ఆశ పడడానికి కూడా ఆంధ్రులకి మనసు రావడం లేదు.ఆర్థిక శాఖ వెబ్ సైట్ లో సాయం తాలూకా పూర్తి వివరాలు ఉంచుతామని జైట్లీ ప్రకటించారు .రోజంతా చర్చోప చర్చలు జరిపి అర్దరాత్రి సమయంలో ఆయనేమి మాట్లాడారో మీరే చూడండి..

‘విభజన వల్ల ఏపీ తీవ్రంగా నష్టపోయింది. ఆదాయం తగ్గిపోయింది. కాబట్టి ఆ రాష్ట్రం ప్రత్యేక హోదా అడగడంలో తప్పులేదు. ఆంధ్రప్రదేశ్  పునర్విభజన చట్టంలో ఏపీకి ఇచ్చిన అన్ని హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చుతుంది. ఆ క్రమంలోనే హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ అవసరమైంది. ఏపీకి హోదాపై నాటి ప్రధాని మన్మోహన్ ప్రకటన, 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు తదితర నాలుగు అంశాల ఆధారంగా ఏపీకి ప్రత్యేక ప్యాకేజీని ఇస్తామని ప్రకటిస్తున్నాం.

మన్మోహన్ సింగ్ 20-2-2014న రాజ్యసభలో చెప్పినట్లు ఆరు అంశాలను స్పష్టంగా పేర్కొన్నారు. వాటిలో ఐదు అంశాలపై ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే ప్రత్యేక హోదా విషయంలో మాత్రమే చర్చ మొదలైంది. కొండ ప్రాంతాలు, ఇతర ప్రత్యేక పరిస్థితులు ఉన్న రాష్ట్రాలకు మాత్రమే హోదా దక్కుతంది. ఏపీకి హోదా ఇవ్వాలా? వద్దా? అనేదానిపై చర్చ మొదలైంది. కొత్తగా ఏ రాష్ట్రానికి హోదా వద్దని 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు చేసిన నేపథ్యంలో ఏపీకి హోదా కాకుండా ప్రత్యేక ప్యాకేజీని ఇస్తాం. ప్యాకేజీలో భాగంగా ఏమేమి ఇస్తామో అన్ని వివరాలు అతి త్వరలోనే వెల్లడిస్తాం’ అని జైట్లీ ముగించారు. ఆర్థిక మంత్రి చెప్పిన కొన్ని కీలక విషయాలు..

– పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని 100 శాతం కేంద్రమే భరిస్తుంది.
– రెవెన్యూ లోటుపై 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల ఆధారంగా ఏపీకి సహకారం
– రైల్వే జోన్ కేటాయింపుపై ఇప్పుడే మాట్లాడలేం
– మరో స్టీల్ ప్లాంట్ నిర్మాణంపైనా తర్వాత మాట్లాడతాం
– చాలా అంశాలు పరిశీలనలో ఉన్నాయి. ఇప్పటికైతే కొన్ని హోదాకాదు.. ప్యాకేజీనే అని స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాం

SHARE