Posted [relativedate]
తెలంగాణ సీఎల్పీ నేత జానారెడ్డి పార్టీ మారుతారన్న ఊహాగానాలు వస్తున్నాయి. తెలంగాణ సాంస్కృతిక సారథి ఛైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఈ చర్చకు తెరతీశారు. జానారెడ్డి టీఆర్ఎస్ లోకి వస్తారని జోస్యం చెప్పారు.
జానారెడ్డి కొంతకాలంగా దూకుడు తగ్గించారు. ప్రభుత్వంపై ఆయన గట్టిగా మాట్లాడిన సందర్భాలు చాలా అరుదు. ఒక విపక్ష నేతగా ఉండి ప్రభుత్వంపై నిప్పులు చెరగాల్సిన ఆయన కావాలనే సైలెంట్ ఉంటారన్న విమర్శ ఉంది. అందుకే టీఆర్ఎస్ కూడా ఆయన విపక్ష నేతగా ఉంటేనే బెటర్ అని అనుకుంటోంది. అయితే టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ డీఎస్ … జానారెడ్డిని కూడా గులాబీదళంలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారట. కాంగ్రెస్ పరిస్థితి బాగాలేదు.. కాబట్టి టీఆర్ఎస్ లో చేరడం బెటర్ అని సూచిస్తున్నారని టాక్. దీంతో జానారెడ్డి కూడా ఆ ప్రతిపాదనపై ఆలోచిస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఎలాగూ జానారెడ్డి ఇక రిటైర్ అయిపోవాలనే యోచనలో ఉన్నారు. కాబట్టి తన కుమారుడిని రాజకీయాల్లోకి తెచ్చేందుకు ఉత్సాహం చూపుతున్నారట. కాంగ్రెస్ లో అయితే ఆయనకు మంచి ఫ్యూచర్ కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే కాంగ్రెస్ లో రెడ్డి నాయకులు ఎక్కువగా ఉన్నారు. వారి మధ్య ఆధిపత్య పోరు కూడా అదే రేంజ్ లో ఉంది. కాబట్టి వాటన్నింటినీ తట్టుకొని నిలబడడం కష్టమే. అదే టీఆర్ఎస్ లో అయితే అలా ఉండదు. కాబట్టి టీఆర్ఎస్ లోకి వెళ్లితే.. తన కుమారుడికి మంచి ఫ్యూచర్ కూడా ఇవ్వొచ్చు. కాబట్టి కారు ఎక్కడానికి ఇదే సరైన తరుణమని డీఎస్ .. జానారెడ్డితో చెప్పినట్టు సమాచారం.
మొత్తానికి ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే… కాంగ్రెస్ లో ఏదో జరుగుతోందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. నాయకత్వం కోసం పోరు బాగానే నడుస్తోంది. కాబట్టి జానారెడ్డి ప్రస్తుత నాయకులతో పోటీపడలేకపోతున్నారట. అందుకే ఇక ఆయన పార్టీ మారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న వాదన వినిపిస్తోంది. మరి రసమయి జోస్యం నిజమవుతుందా… నిజంగానే పెద్దాయన పార్టీ మారుతారా…చూడాలి!!