Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
జనసేన పార్టీ పెట్టి ఏళ్లు గడుస్తున్నా.. ఆ పార్టీకి సంస్థాగత సెటప్ అన్నది లేదనే చెప్పాలి. పార్టీని ప్రకటించిన నాటి నుంచి మొన్నా మధ్య వరకూ పవన్ కల్యాణ్ వన్ మ్యాన్ షో నడిపించారు. 2019 ఎన్నికల్లో పోటీ చేస్తామన్న మాటను స్పష్టంగా చెప్పిన నాటి నుంచి పార్టీ అంశాల్ని ఒక్కొక్కటిగా దృష్టి సారిస్తున్నారు. ఇందులో భాగంగా పార్టీ కోసం పని చేసే వారి కోసం అప్లికేషన్లు పెట్టుకోవాలని.. పరీక్షలు పెట్టనున్నట్లుగా చెప్పటం తెలిసిందే. జనసేన పార్టీ కోసం పని చేసే వారి కోసం చేస్తున్న ఎంపిక తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సమాజం పట్ల అవగాహన.. లోతైన విశ్లేషణ చేయగల సామర్థ్యం ఉన్న వారిని మాత్రమే జనసేన కార్యకర్తలుగా ఎంపిక చేయనున్నట్లుగా తెలుస్తోంది.
మూడు అంచెల్లో ఎంపిక విధానం సాగుతుందని చెబుతున్నారు. పార్టీలో పని చేసేందుకు ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులు సేకరించి.. వడపోస్తున్నారు. సామాజిక స్పృహ.. భావ ప్రకటనలో పట్టు.. రాతలోనూ ఎదుటివారి దృష్టిని ఆకర్షించేలా ఉన్న వారికే అవకాశం లభిస్తుందట. వివిధ అంశాలపై అవగాహనతో పాటు స్థానిక సమస్యలపై ఉన్న పట్టును కూడా పరీక్షించిన తర్వాత మాత్రమే జనసేనలోకి ఎంట్రీ లభించనుంది. ఇందుకోసం మూడు రకాల పరీక్షల్ని పెట్టి.. అందులో ప్రతిభను ప్రదర్శించిన వారికి మాత్రమే జనసేనలో ఎంట్రీ దక్కేలా డిజైన్ చేయటం గమనార్హం. 1. ఎదుటి వారిని ఆకట్టుకునేలా మాట్లాడటం 2. ఏదైనా విషయాన్ని అందరికి అర్థమయ్యేలా రాయటం 3. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను ఎలా పరిష్కరించుకోవచ్చన్న విషయాన్ని చెప్పటంతో పాటు ఆ సమస్యతో వచ్చే ఇతర అంశాల్ని విశ్లేషించే సామర్థ్యం కూడా ఎంపికలో గీటురాయిగా నిలుస్తుందట.
ఇలా మూడు రకాల పరీక్షల్లో ప్రతిభ ప్రదర్శించిన వారికి పార్టీలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. పార్టీలో చేరే వారికి వారి జిల్లాలకు సంబంధించి స్థానిక అంశాలపై ఎంత అవగాహన ఉందన్న విషయంపై దృష్టి సారిస్తున్నారు. నిపుణుల ముందు సమస్యల్ని ప్రస్తావించాల్సి ఉంటుంది. స్థానిక సమస్యలపై అభ్యర్థులు ప్రసంగించాల్సి ఉంటుంది. ఇక కంటెంట్ రైటర్స్.. ఎనలిస్టులు మాత్రం ప్రశ్న పత్రాల్లో ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. పరీక్ష అనంతరం ఎంపిక చేసిన కొద్ది మంది అభ్యర్థుల వీడియో ప్రసంగాలు.. రాత పరీక్షల సమాధానాల్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే పార్టీకి ఎంపిక చేయనున్నారు. అభ్యర్థుల ప్రసంగాల్ని వీడియోలుగా రికార్డు చేసి.. వారి మాటల్ని నిపుణులు వినటం.. భాష మీద వారికున్న పట్టు.. అంశాల మీద వారికి ఉన్న అవగాహనను విశ్లేషించనున్నారు. సమస్యల మీద మాట్లాడటం తప్పించి.. ఇతర అంశాలపై ప్రాధాన్యత ఇచ్చిన వారికి అవకాశం లభించదని చెబుతున్నారు.