ఎంపీ పై అమ్మ ఆగ్రహం.. కొట్టినందుకా..? క్షమాపణ చెప్పినందుకా..?

0
486

jayalalitha fire sashikala pushpaతమిళనాడు కు చెందిన ఎంపీలు ఢిల్లీ విమానాశ్రయంలో కొట్టుకోవడంపై రాజ్యసభలో రగడ రేగింది.  డీఎంకే ఎంపీ తిరుచ్చి శివను నాలుగుసార్లు లెంపకాయ కొట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అన్నాడీఎంకే ఎంపీ శశికళ రాజ్యసభలో కన్నీరు పెట్టుకున్నారు. జరిగిన ఘటనకు తాను శివకు క్షమాపణ చెబుతున్నానని ప్రకటించారు. అదే సమయంలో ఆమె స్వరం పెంచి – తాను మహిళనని, తనకు ప్రాణ హాని ఉందని చెప్పారు.

దీంతో సభాపతి స్థానంలో ఉన్న డిప్యూటీ చైర్మన్ కురియన్ ఆమెకు భద్రత పెంచాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించారు. శశికళ తన ఆవేదన వ్యక్తం  చేస్తున్న సమయంలోనే అటు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆమెను పార్టీనుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.

రెండ్రోజుల కిందట ఏర్ పోర్ట్ లో శివను శశికళ పుష్ప కొట్టినట్లు వార్తలొచ్చాయి. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తోటి ఎంపీనే కొట్టిన మహిళా ఎంపీ దూకుడుకు అడ్డుకట్ట లేదా, ఎంపీ అయితే ఇష్టానుసారం బిహేవ్ చేయవచ్చా..అని శశికళ కు వ్యతిరేకంగా అనేక పోస్టులు వెలువడ్డాయి.తన నాయకురాలు, జయలలితకు వ్యతిరేకంగా మాట్లాడినందుకే సహించలేక తానతన్ని కొట్టానని శశికళ చెప్పుకొచ్చారు.

శివ ఈ విషయాన్ని ఖండిస్తూ తాను జయను ఏమాత్రం అనలేదన్నారు. సెక్యూరిటీ సిబ్బంది తనకు గౌరవ మర్యాదలివ్వడాన్ని సహించలేక తాను కూడా ఎంపీనని తననెందుకు శివలానే ట్రీట్ చేయరని శశికళ గొడవ కు దిగారని, తనను అక్కడనుంచి కాలర్ పట్టుకుని బరబరా లాక్కొని వచ్చి కొట్టారని శివ వివరించారు. ఒకవేళ నిజంగానే తాను జయలలితపై విమర్శలు చేసినా – అలా కొట్టడం శశికళకు న్యాయమేనా, ఒక ఎంపీ స్థానంలో ఉన్న వ్యక్తి బిహేవ్ చేయాల్సిన పద్ధతి ఇదేనా అని అడిగారు.

మహిళ కాబట్టి తాను ఎవరికీ ఫిర్యాదు చేయలేదని, తన నేత కరుణానిధిని కలిసి విషయాన్ని వివరించానని చెప్పారు.ఇంత జరిగినా శశికళ మాత్రం జయను కలవకుండా ఢిల్లీలోనే ఉండిపోయారు. బహుశా ఇదే జయ ఆగ్రహానికి కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. పెద్ద గొడవ జరిగినపుడు తనకు ఎక్స్ ప్లనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నది జయ అభిప్రాయంగా కనిపిస్తోంది.  శివకు క్షమాపణ చెప్పడాన్ని కూడా జయ జీర్ణించుకోలేకపోయినట్లున్నారని అన్నాడీఎంకే వర్గాలు అంటున్నాయి. అందుకే ఆమె క్షణం కూడా ఆలస్యం చేయకుండా శశికళపై వేటు వేసేశారు.

Leave a Reply