జయ మేనకోడలు చెప్పే రహస్యాలేమిటి..?

Posted December 8, 2016

jayalalitha niece deepa said about jayalalitha secrets
జయకి నెచ్చెలి శశికళ అంతిమసంస్కారాలు నిర్వహించడాన్ని తప్పుబడుతూ ఓ యువతి ముందుకొచ్చింది.ఆమె మరెవరో కాదు సాక్షాత్తు జయ అన్న కుమార్తె .పేరు దీప.జయ అంత్య క్రియలు పూర్తి అయిన రెండో రోజు ఆమె గొంతెత్తారు.ఒక మహిళ అంతిమసంస్కారాలు నిర్వహించడం తానెప్పుడూ చూడలేదని దీప అన్నారు.అంతేగాక జయ మరణంలో ఎన్నో సందేహాలు,రహస్యాలు ఉన్నాయని …వాటిపై త్వరలోనే సాక్ష్యాధారాలతో మాట్లాడతానని దీప ప్రకటించారు.

ఒకప్పుడు జయ అన్న కుటుంబం ఆమె తోనే ఉండేది.అయితే మనస్పర్ధలతో వాళ్ళు దూరంగా వెళ్లిపోయారు.కానీ పోయెస్ గార్డెన్ లో వున్నప్పుడే దీప పుట్టింది.రెండు కుటుంబాల మధ్య దూరం పెరిగాక జయ వారిని పట్టించుకోలేదు.వదిన చనిపోయినా …మేనకోడలు పెళ్లి అయినా జయ వెళ్లిన ధాఖలాల్లేవు.కానీ పెళ్లి తర్వాత దీప భర్తతో కలిసి జయ ఆశీర్వాదం కోసం వచ్చారు.జయ దీప కి బహుమతిగా ఓ ఫ్లాట్ కూడా కొనిచ్చారు.భర్తతో విభేదాలతో దీప ఇప్పుడు ఒంటరిగానే వుంటున్నారు.

ఇటీవల అపోలో వద్ద తనని లోపలికి రానివ్వడం లేదని ఆమె గొడవ చేశారు.చివరికి లోపలికి వెళ్లారు గానీ జయని చూడకుండానే బయటికి వచ్చారు.
జయ వారసత్వం మీద ఆశలు పెట్టుకున్న దీప ఇప్పుడు ఆమె మరణం వెనుక రహస్యాలు చెప్తానని అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.ఆమె ఏమి చెప్తారన్నదానిపై పార్టీలేమో గానీ ప్రజలు,మీడియా ఆసక్తి ఎక్కువగా వుంది.ఈ పరిస్థితిని ఆసరా చేసుకుని దీప ని పావుగా వాడుకునేందుకు కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.ఈ ఎపిసోడ్ ఎంత దూరం వెళుతుందో …జయ మేనకోడలు ఏమి చెపుతుందో వేచి చూడాలి.

SHARE