Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అందినంత డబ్బు, చెప్పలేనంత స్వేచ్ఛ.. ఇవిచాలు పిల్లలు తప్పుదారి పట్టడానికి. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖుల పిల్లలు చాలా మందికి ఈ రెండూ పుష్కలంగా ఉన్నాయి. అందుకే గత కొన్నాళ్లుగా ఎంతోమంది వీఐపీలు, సెలబ్రిటీల పిల్లలు అతివేగంతో వాహనాలు నడిపి ప్రాణాలు కోల్పోయారు. ఈ సందర్భంగా వారి తల్లిదండ్రుల వ్యవహారశైలిపై కూడా చర్చ జరిగింది. పిల్లలకు అన్నీ ఇస్తున్న పేరెంట్స్.. వారిపై సరైన నిఘా పెట్టడం లేదన వాదన తెరపైకి వచ్చింది. మెచ్యూరిటీ రాకుండానే పిల్లలకు హైఎండ్ వాహనాలిచ్చి చేతులారా భవిష్యత్తును పాడుచేస్తున్నారని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
ధనవంతుల పిల్లల్లో విచ్చలవిడితనం బాగా పెరిగిపోయిందని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పిల్లలు బార్లకు, పబ్బులకు వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి పదకొండు గంటల లోపే పబ్బులు, బార్లు మూసేయాలన్నారు. సాధారణంగా సంతాపం తెలపడానికి వచ్చినప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు ఎవరూ చేయరు. కానీ జేసీ అందుకు భిన్నం కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారు.
జేసీ ఏ సమయంలో ఈ వ్యాఖ్యలు చేశారనేది పక్కనపెడితే.. ఆయన చెప్పిన మాటలు నిజమే అనే సంగతి మనందరికీ తెలుసు. ఇలాంటి ప్రమాదాలు ఎన్ని జరిగినా.. సంపన్నులు, వారి పిల్లల వైఖరిలో మార్పు రాదనేది కూడా అంతే నిజం. ఏ మనిషి అయినా ఎవరికో ఒకరికి భయపడాలని జేసీ అన్నారు. భయం లేకుండా పోతే ఎలాగని ప్రశ్నించారు. ప్రస్తుత కాలంలో తల్లిదండ్రులు, పిల్లలు, పెద్దలు అందరూ బిజీబిజీగా ఉంటున్నారని వ్యాఖ్యానించారు. ఎవరు ఎప్పుడు వస్తున్నారో, ఎప్పుడు వెళ్తున్నారో తెలియడం లేదన్నారు.