రిలయెన్స్ జియో. ఇప్పుడిదే ఓ సంచలనం. ఉచితం మాటున సాగుతున్న ప్రచారం మాయలో భారతీయం పరుగులు పెడుతోంది. చివరకు బ్లాక్ లో కూడా సిమ్ కార్డులు కొనుక్కునే స్థాయి వచ్చేసింది.
దేశంలో అంబానీల హవా ఏ స్థాయిలో ఉందో చెబుతోంది. అయితే అసలు వాస్తవాలను ఈప్రచారం మరుగున పరిచేస్తోంది.
డేటా గిరీ అంటూ రిలయెన్స్ దోపిడీ కోటకు వంత పాడుతోంది.
అయితే వాస్తవాలు మాత్రం ప్రచారానికి చాలా భిన్నంగా ఉండడం విశేషం.
అందుకే రిలయెన్స్ , బీఎస్ఎనెల్ మధ్య ఉన్న కొన్ని వైరుధ్యాల పరిశీలిస్తే వాస్తవాలు అర్థమవుతాయి.
1. జియో చిన్న ప్లాన్ ప్రకారం ఒక రోజు వ్యవధితో 100ఎంబీ డేటా ఆఫర్ చేస్తోంది. దానికి 19 రూపాయలు వసూల్ చేస్తోంది. అయితే బీఎస్ఎన్ఎల్ మాత్రం 110 ఎంబీని కేవల 17 రూపాయలకు అంటే జియో కన్నా అదనపు డేటాను దానికన్నా తక్కువకే ఇస్తోంది.
2. జియో 149 రూ.ల ప్లాన్ ప్రకారం 300 ఎంబీ డేటా ఒక నెల వినియోగం కోసం వస్తుంది. అదే ప్లాన్ బీఎస్ఎన్ఎల్ కేవలం 109 రూ.లకే అందిస్తుండం విశేషం.
3. జియో 499రూ.ల ప్లాన్ ప్రకారం ఒక నెల వ్యవధికి 4 జీబీ డేటా వస్తుంది. అదే సమయంలో బీఎస్ఎన్ఎల్ 10జీబీని కేవలం 549రూ.లకే అందిస్తుండడం గమనార్హం. అంతేగాకుండా బీఎస్ఎన్ఎల్ ప్లాన్స్ లో 156రూ.లకే 2జీబీ కూడా ఉంది.
4. రిలయెన్స్ 10జీబీ 999రూ.లకు అందిస్తోంది. కానీ బీఎస్ఎన్ఎల్ లో అదే ప్లాన్ ఖరీదు 549రూ.లు కావడం గమనించాల్సిందే. అంతేగాకుండా 1049రూ.లకే అపరిమితమైన అన్ లిమిటెడ్ డేగా ఆఫర్ ను బీఎస్ఎన్ఎల్ అందిస్తోంది.
5. జియో లో అతిపెద్ద ప్లాన్ 4999రూ.లు. దానిద్వారా 75 జీబీ డేటా మూడు నెలల వినియోగానికి లభిస్తుంది. కానీ బీఎస్ఎన్ఎల్ 3జీ ప్లాన్ 3 నెలలకు 3297 రూ.లు మాత్రమే. అది కూడా కాకుండా అది అపరిమిత డేటాతో కావడం విశేషం.
ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇక ఐడియా, ఎయిర్ టెల్ వంటి వారి ఆఫర్లను పరిగణలోకి తీసుకుంటే జియో అసలు వ్యవహారం అర్థమవుతుంది. ఇక వాయిస్ కాల్స్ ఉచితం గురించి చేస్తున్న ప్రకటనలో కూడా అసలు గుట్టు వేరుగా ఉంది. రిలయెన్స్ జియోలో వాయిస్ కాల్స్ కూడా డేటా కేటగిరిలో లెక్క వేస్తున్నారు. అంటే తద్వారా మీకు ఉచిత వాయిస్ కాల్స్ అని చెబుతున్నవన్నీ డేటా ఆఫర్ కింద లెక్కలేస్తారు. వాయిస్ కాల్స్ ఖర్చును డేటా ప్యాకేజీ నుంచి పరిగణిస్తారు. అయినా అది చెప్పకుండా పూర్తిగా ఉచితం అన్నట్టుగా ప్రచారం చేస్తూ మభ్యపెడుతుండడం విశేషం.
అయితే బీఎస్ఎన్ఎల్ , జియో ఆఫర్లలో ఒక్క తేడా స్పష్టం. బీఎస్ఎన్ఎల్ ఆఫర్లన్నీ 3జీ డేటా మాత్రమే. జియో 4 జీ అని చెబుతోంది. కానీ వాస్తవం ఏమంటే 3జీ,4జీ మధ్య పెద్ద తేడా ఉండదు. అయినా వేగం అందుకోవడానికి మన హ్యాండ్ సెట్లు దానికి తగ్గట్టుగా ఉండాలి. సాధారణ హ్యాండ్ సెట్లు వాడుతూ జియో అని మురిసిపోవడం వ్యాపార మాయ మాత్రమే. ప్రస్తుతం అక్కడక్కడా మాత్రమే జియో వాడుతుండడంతో కొంత వేగంగా నెట్ స్పీడ్ ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ కస్టమర్లంతా వాడుకలోకి వస్తే అసలు గుట్టు అర్థం కావడానికి అట్టే సమయం పట్టకపోవచ్చన్నది నిపుణుల అభిప్రాయం.