జీఎస్‌టీ లో ప్రయివేట్‌కు వాటా

0
540

jst1
దేశవ్యాప్తంగా ఏకీకృత పన్నుల జీఎస్‌టీ విధానంలో కేంద్రంతోపాటు రాష్ట్రాలు వసూలు చేసే పన్నులకు సంబంధించిన గణాంకాలను ఒకేఒక నెట్‌వర్క్‌ ద్వారా నిర్వహించాలని గత ప్రభుత్వం తలపోసింది. వస్తు,సేవల పన్ను(జీఎస్‌టీ) విధానం అమలుకు సంబంధించిన వివరాలు, లెక్కల నిర్వహణ కోసం ఏర్పాటు చేసే నెట్‌వర్క్‌ విషయంలో కేంద్రం ప్రతిపాదనల పట్ల ఆర్థికశాఖలోని ఉన్నతాధికారుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమైనట్టు తెలుస్తున్నది. ఈ పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లోనే జీఎస్‌టీ బిల్లుకు ఆమోదం సాధించాలని ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం .

ఇప్పటికే లోక్‌సభలో ఆమోదం పొందిన జీఎస్‌టీ బిల్లుకు రాజ్యసభలోనూ అవసరమైన బలాన్నీ సమకూర్చుకునే ప్రయత్నాల్లో మోడీ ప్రభుత్వం తలమునకలైంది. 2011-13లోనే జీఎస్‌టీ నిర్వహణ కోసం ఏకీకృత కంప్యూటర్‌ నెట్‌వర్క్‌కు యూపీఏ ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే, నెట్‌వర్క్‌ ఏర్పాటుకు అవసరమైన పెట్టుబడులను ప్రయివేట్‌ సంస్థల నుంచి తీసుకోవాలని నిర్ణయించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ లిమిటెడ్‌, ఎల్‌ఐసీ హౌజింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌, ఎన్‌ఎస్‌ఈ స్ట్రేటెజిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ సంస్థలను పెట్టుబడులకు ఆహ్వానించింది. ప్రయివేట్‌ సంస్థలు రూ.5 కోట్లు పెట్టుబడిగా పెట్టాయి.

జీఎస్‌టీ నెట్‌వర్క్‌ కంపెనీ ఏర్పాటుకు మొత్తం రూ.3000 కోట్ల పెట్టుబడి అవసరమవుతుందని అంచనా. ఇందులో ప్రభుత్వ వాటా 49 శాతం,ప్రయివేట్‌ వాటా 51 శాతంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. నెట్‌వర్క్‌ సేవలు అందించినందుకు ఫీజు కింద కంపెనీకి ప్రతిఏటా పెద్దమొత్తంలో డబ్బులు ముట్టజెప్పాల్సి ఉంటుంది. అంటే..కేవలం రూ.5 కోట్ల పెట్టుబడితో ప్రయివేట్‌ సంస్థలకు ఇంత భారీ ప్రాజెక్ట్‌లో సమాన వాటా ఇవ్వడమంటే సంపదను అప్పనంగా దోచిపెట్టడమేనన్న భావన ఎవరికైనా కలగడం సహజం. ఇదే అభిప్రాయం ఆర్థికశాఖలోని ఉన్నతాధికారుల నుంచి వ్యక్తమైనట్టు తెలుస్తున్నది. నెట్‌వర్క్‌లో ప్రయివేట్‌కు భాగస్వామ్యం కల్పించే ప్రభుత్వ ప్రతిపాదనకు ఎక్స్‌పెండీచర్‌ సెక్రెటరీ, సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎక్సైజ్‌ అండ్‌ కస్టమ్స్‌(సీబీఈసీ) అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్టు ప్రచార్ జరుగుతోంది.

నెట్‌వర్క్‌ ఏర్పాటు కాంట్రాక్ట్‌ను ఇన్ఫోసిస్‌ దక్కించుకున్నట్టు తెలుస్తున్నది. అయితే, ఒప్పందం ప్రకారం నెట్‌వర్క్‌ నిర్వహణలో హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ వంటి ఆర్థిక సంస్థలకు భాగస్వామ్యం కొనసాగనున్నది. సీబీఈసీకి సొంత కంప్యూటర్‌ వింగ్‌ ఉన్నది. పన్నుల వసూళ్ల కోసం నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసిన అనుభవం కూడా ఈ సంస్థకున్నది. ఇన్ఫోసిస్‌కన్నా తక్కువ ఖర్చుతో నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయగల సామర్థ్యం కూడా ఈ సంస్థకున్నది. ఈ విషయాలనే ప్రభుత్వానికి చెబుతూ అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దాంతో, ఆర్థిక మంత్రిత్వశాఖ మనసు మార్చుకున్నట్టు తెలుస్తున్నది. భవిష్యత్‌లో ఈ ప్రాజెక్ట్‌ కోసం అయ్యే ఖర్చునంతా ప్రభుత్వమే భరించాలన్న నిర్ణయానికొచ్చినట్టు అధికారవర్గాల నుంచి సమాచారం.

Leave a Reply