శాంటోస్ ది నోబుల్ లీడర్ ..

0
402

Posted [relativedate]

 juan manuel santos nobel peace prize
జనం కోసం మంచి చేసేవాడు కాకుండా …మంచైనా చెడైనా జనం కోరుకుంది చేసేవాడు నాయకుడిగా చెలామణి అయ్యే రోజులివి.డిమాండ్ అండ్ సప్ప్లై అంటూ ఆర్థికశాస్త్రంలో వుండే పరిభాషని రాజాకీయాల్లో తూచా తప్పకుండా పాటిస్తున్న పరిస్థితులు మన దేశం లోనే కాదు ప్రపంచమంతా నెలకొన్నాయి.జనం భావోద్వేగాల మీద స్వారీ చేసే నాయకులే కానీ వారి అవసరాలు,ఆలోచనల్ని ప్రభావితం చేసి వారిని సరైన దారిలో నడిపే వాళ్ళు ఎక్కడైనా కనిపిస్తున్నారా ?కనీసం ఆ ప్రయత్నం చేసే వాళ్ళైనా ఉన్నారా? వున్నారు..చీకట్లో కాంతిపుంజంలా అక్కడక్కడా మెరుస్తున్నారు.అలాంటి ఓ మెరుపు శాంటోస్.అయన గెలిచింది నోబెల్ శాంతి పురస్కారం.కానీ అంతకన్నా గొప్ప విషయం ఒకటుంది.

కొలంబియా అంతర్యుద్ధం వయసు అర్ధ శతాబ్దం.ఆ అగ్నిజ్వాలల్లో రెండున్నర లక్షలమందికి పైగా కన్ను మూశారు.మరో 50 వేల మంది జాడ తెలియకుండా పోయింది.దాదాపు 60 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.లెఫ్టిస్ట్,రైటిస్ట్ భావజాలం మధ్యపోరు…డ్రగ్ మాఫియా అరాచకాల నడుమ జీవన మాధుర్యాన్ని అక్కడి ప్రజలు ఎప్పుడో మరిచిపోయారు.జీవించడమే గొప్ప అయిపోయింది.ఒకరిని చూస్తే మరొకరికి ద్వేషం.ఈ పరిస్థితుల్లో శాంతి కోసం శాంటోస్ ఓ యజ్ఞమే చేశారు.అది జయప్రదం కాకుండా చివర్లో రెఫరెండం ద్వారా ప్రజలే అడ్డుపడ్డారు.అయితే అది ఓటమి కానే కాదు.శాంతి ఒప్పందానికి అనుకూలంగా 49.79 %,వ్యతిరేకంగా50.21% ఓటు వేశారు.వాళ్ళ మధ్య తేడా కేవలం1 శాతానికి లోపే.

50 ఏళ్ల వైరభావాన్ని దాదాపు సగం మందిలో తుడిచిపెట్టిన శాంటోస్ ఆ శేషాన్ని కూడా పూర్తిచేయగలరు.ఇప్పుడు నోబెల్ బహుమతి ఆయనకు వచ్చిన విషయం కొన్నాళ్ల తరువాత రికార్డులకే పరిమితం కావచ్చు.కానీ అయన పెంచిపోషించిన శాంతివనంలో చిరునవ్వులు చిరకాలం విరబూస్తూనే ఉంటాయి.అలా జనం కోరింది కాకుండా వారికి అవసరమైంది సమకూర్చే శాంటోస్ లాంటి నాయకుల అవసరం ప్రపంచానికి ఎంతో వుంది.ఎస్ శాంటోస్ నోబెల్ విజేత మాత్రమే కాదు నోబుల్ లీడర్ కూడా..

[wpdevart_youtube]HoNjP0yJwGA[/wpdevart_youtube]

Leave a Reply