డివైడ్ టాక్ వచ్చినా కబాలి అవలీలగా సెంచరీ కొట్టేశాడు. ఆ ఫీట్ ను ఒక్కటంటే ఒక్కరోజులోనే సాధించింది. ఈ విషయాన్ని స్వయంగా ఆ సినిమా నిర్మాత కలైపులి ఎస్.థాను వెల్లడించారు. రాధికా ఆప్టే, ధన్సిక తదితరులు ప్రధాన పాత్రలలో నటించిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా సినిమా కలెక్షన్లు ఎంతో అధికారికంగా ఇంకా రావాల్సి ఉందని, కానీ మొదటిరోజు ఎంతలేదన్నా కనీసం రూ. 100 కోట్లు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దేవుడి దయతో సినిమా బాగా ఆడుతోందని చెప్పారు.భారతదేశంలోనే కాక విదేశాల్లో కూడా కలెక్షన్లు బాగున్నట్లు కలైపులి తెలిపారు. సినిమా విషయంలో భాష ఎప్పుడూ సమస్య కాబోదని అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10వేల స్క్రీన్లలో సినిమా విడుదలైందని, అమెరికాలో 480, మలేసియాలో 490, గల్ఫ్ దేశాల్లో 500 స్క్రీన్లలోను సినిమా విడుదలైనట్లు ఆయన చెప్పారు, 32 ఏళ్లుగా ఆయనతో అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉన్నానని అన్నారు. కొచ్చాడయాన్, లింగా సినిమాలు ఫ్లాప్ కావడంపై ప్రశ్నించగా.. కొచ్చాడయాన్ లో రజనీ నటించలేదని.. కేవలం ఆయన గొంతు మాత్రమే ఉంటుందని అన్నారు. ఇక లింగాపై రకరకాల రూమర్లు వచ్చినా.. ఆ సినిమా రూ. 40 కోట్లకు పైగా వసూలు చేసిందని చెప్పారు.