టీడీపీ ఆంతరంగిక విషయాలు.వాటంతటవే బయటపడితే ఏమోగానీ …నాయకులు వాటిపై బహిరంగ ప్రకటనలు చేయటం కాస్త తక్కువే .అది కూడా ఆ పార్టీ అధికారంలో ఉంటే మరీ కష్టం…ఇటీవల టీజీ .వెంకటేష్ రాజ్యసభ వ్యవహారంలో నోరు జారీన కె.ఇ.ప్రభాకర్ వెంటనే క్షమాపణలు చెప్పారు.ఇలాంటి పరిస్థితుల్లో ప్రకాశం జిల్లాలో పార్టీ సీనియర్ నేత కరణం బలరామకృష్ణ మూర్తి.ఓ టీవీ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు….చంద్రబాబు.ఏ విషయాలు బయటకు రావడం ఇష్టపడరో….అలాంటి వాటి మీదే ఆయన మాట్లాడారు.
నాలుగో రాజ్యసభ సీటు కోసమే టీడీపీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించిందని బలరాం వ్యాఖ్యానించారు.మరో 8 మంది వైసీపీ ఎమ్మెల్యే లు టీడీపీ లో చేరివుంటే విజయ సాయిరెడ్డి రాజ్యసభకు ఎన్నికయ్యే వారు కాదని చెప్పారు.పాతబడ్డ అంశాన్ని మళ్ళీ రేపిన ఆయన పార్టీ వ్యూహం ఫలించలేదని తేల్చేశారు .వైసీపీ నుంచి వచ్చి జిల్లా రాజకీయాల్లో తనతో తలపడుతున్న అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ను ఆయన పిల్లవాడిగా అభివర్ణించారు…పైగా డాన్స్ మాస్టర్ ను పట్టుకుంటే లాభించలేదని హెచ్చరించారు.ఈ రెండు వ్యాఖ్యల్లో పార్టీ వైఖరిని బలరాం సూటిగానే తప్పుబట్టారు.
కాంగ్రెస్ హయాంలో చంద్రబాబు మంత్రి కావటానికి తాను ఎంతో సహాయపడ్డానని తెలిపారు.అందుకోసం ఢిల్లీ లో తానెంత కష్టపడింది చంద్రబాబుకు తెలుసన్నారు.అసలు విషయం చెప్పి అయినా ఆ విషయాలు ఇప్పుడు అప్రస్తుతం అన్నారు.చంద్రబాబు తనకు ఆర్టీసి చైర్మన్ పదవి ఇస్తామని గతంలో ప్రకటించిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. టీడీపీ లో చంద్రబాబు,దగ్గుబాటి మధ్య విభేదాల వల్లబాబు రాజకీయంగా నష్ట పోయానని చెప్పారు.ఈ విషయాన్ని చంద్రబాబు వల్ల తనకు జరిగిన నష్టాన్ని వివరించడమే.
బలరాం టీవీ ఛానల్ ఇంటర్వ్యూ లో ప్రస్తావించిన విషయాలేమి కొత్తవికావు…రాజకీయ పరిణామాల్ని కాస్త కుతూహలంగా పరిశీలించే వారందరికీ తెలిసినవే .ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతాయని తెలిసీ… ఆయన ఇంటర్య్వూ ఇచ్చారు తానిచ్చే సమాధానాలపై మళ్ళీ చర్చ జరుగుతుందని కూడా బలరాం కు బాగా తెలుసు..ఇటీవల ప్రకాశం జిల్లా పార్టీ వ్యవహారాల్లో బలరాం ప్రభావానికి గండిపడిందంటూ వార్తలొస్తున్నాయి.ఒంగోలు సభ లో చంద్రబాబు వ్యవహార శైలి అందుకు దోహదపడింది.ఆ సభ తర్వాతే పార్టీలో తన పలుకుబడి తగ్గిందని బలరాం భావించారేమో !ఇక సిఐ ల బదిలీ వ్యవహారం కూడా ఆయన కు చికాకు తెప్పించి ఉంటుంది.
ఈ పరిస్థితిల్లో అవమానాలు భరిస్తూ పార్టీలో కొనసాగడమా?లేక అధిష్టానం వైఖరిలో మార్పు తెప్పించి.తన ప్రాధాన్యాన్ని పెంచుకోవడమే?..ఈ రెండు మార్గాలే బలరాం కు ఉన్నాయి.ఆ రెంటిలో ఏది జరగాలన్న తన వాణి బలంగా వినిపించడమే మేలని బలరాం అనుకుని వుంటారు.అయితే బలంగా వినిపించటం అంటే బహిరంగంగా వినిపించటం కాదని హైకమాండ్ అనుకోవచ్చు.అంతరంగికంగా ఆ విషయాల్ని చర్చించవచ్చు కదా అని ఆలోచించవచ్చు.
ఏదేమైనా చంద్రబాబు ,బలరాం మధ్య వున్నది రాజకీయ బంధమేకాదు..దశాబ్దాల స్నేహం కూడా ఉంది. ఇప్పుడు ఆ స్నేహం గెలుస్తుందో ,రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమవుతాయో తేలే సమయం ఆసన్నమైంది.