ఇద్దరు సినిమా చూపిస్తున్న కేసీఆర్, కోదండరాం

Posted November 29, 2016, 11:29 am

Image result for kcr and kodandaram
ఇద్దరు  సినిమా గుర్తుంది కదా. అందులో ఇద్దరు మిత్రులు తర్వాత ఎలా శత్రువులు అవుతారో చూస్తాం. అచ్చం ఆ సినిమాను తలపిస్తున్నారు కేసీఆర్, కోదండరాం.

తెలంగాణ సీఎం కేసీఆర్.. కోదండరాం స్నేహం గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ ఏర్పాటుకు ముందు కేసీఆర్ చొరవ వల్లే … కోదండరాం జేఏసీ ఛైర్మన్ అయ్యారు. ఆ తర్వాత చాలా విషయాల్లో ఒకరికొకరు సహకరించుకున్నారు. ముఖ్యంగా జేఏసీ ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా.. ముందు కేసీఆర్ కు సమాచారం అందేది. ఆయన గ్రీన్ సిగ్నల్ తర్వాతే కోదండరాం బృందం ముందుకెళ్లేది. అందుకే జేఏసీ ఏ నిరసన చేపట్టినా అది సక్సెస్ అయ్యింది. చివరకు ఢిల్లీ దిగొచ్చింది. తెలంగాణ ఇచ్చేసింది. ఆ తర్వాత కేసీఆర్, కోదండరాం మధ్య గ్యాప్ వచ్చేసింది.

నిజానికి 2014 ఎన్నికల్లో కేసీఆర్.. కోదండరాంకు టికెట్ కూడా ఆఫర్ చేశారట. కానీ ఎందుకనో టీఆర్ఎస్ లోకి వెళ్లడానికి ఆయన ఒప్పుకోలేదు. పోనీ ఆయన అలాగే ఉన్నా సరిపోయేదోమో.. కానీ క్రమంగా టీఆర్ఎస్ ను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ముఖ్యంగా మల్లన్నసాగర్ పై విమర్శలు ఎక్కుపెట్టి .. ప్రతిపక్షాలకు కూడా దగ్గరయ్యారు. ఆ తర్వాత ప్రతి అంశంలోనూ కోదండరాం మాట్లాడుతున్నారు. రైతు ఆత్మహత్యల విషయంలో ప్రభుత్వ వైఖరిని తప్పు బట్టారు. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మించుకున్న ప్రగతి భవన్ పైనా విమర్శలు గుప్పించారు. ఒక్క ఏడాదిలోనే పెద్ద క్యాంప్ ఆఫీసు కట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి .. డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టడంతో ఎందుకు ఆలస్యమవుతుందని సూటిగా ప్రశ్నించారు. ఇలా ప్రతిపక్షాల కంటే కూడా కోదండరాం విమర్శలే ఎక్కువ హైలైట్ అవుతున్నారు.

ఒకప్పుడు తనకు చేదోడువాదోడుగా ఉన్న కోదండరాం ప్రభుత్వాన్ని ఎందుకు ఇరుకున పెడుతున్నారో తెలియక కేసీఆర్ కూడా తికమక పడుతున్నారట. కోదండరాం తీరుపై ఆగ్రహంగానూ ఉన్నారట. అటు కోదండరాం వెర్షన్ లో చూస్తే ఇప్పుడు కేసీఆర్ వైఖరి బాగాలేదని ఆయన సన్నిహితుల దగ్గర చెబుతున్నారట. అంతేకాదు బంగారు తెలంగాణ పేరుతో ఊరించడం తప్ప.. కేసీఆర్ ఏమీ చేయట్లేదని కోదండరాం బహిరంగంగానే మాట్లాడుతున్నారు.