కేసీఆర్ ను ఆక‌ట్టుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే?

 Posted March 22, 2017

kcr focus on congress mla vamshi chand reddy
తెలంగాణ కాంగ్రెస్ యువ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డిపై టీఆర్ఎస్ ఫోక‌స్ పెట్టిందా? ఆయ‌న్ను పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయా? ఆదిశ‌గా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయా? అంటే ఔన‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

వంశీచంద్ రెడ్డి క‌ల్వ‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. గ‌తంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్య‌క్షుడిగా ప‌నిచేశారు. ఆ బ్యాక్ గ్రౌండ్ తోనే టికెట్ వ‌చ్చింది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో వంశీచంద్ రెడ్డి దెబ్బ‌కు…2014 ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ మూడోస్థానానికే ప‌రిమిత‌మైంది. ఆ త‌ర్వాత కూడా వంశీ జోరు పెరిగింది. నియోజ‌క‌వ‌ర్గంపై ఆయ‌న బాగా ప‌ట్టు సాధించారు. స‌మ‌స్య‌ల విష‌యంలో చురుగ్గా స్పందిస్తున్నారు. అందుకే జ‌నంలో ఆయ‌న‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. అసెంబ్లీలోనూ ఆయ‌న మాట‌తీరు చాలా హుందాగా ఉంటుంది. స‌మ‌స్య‌ల‌పై త‌ప్ప ఇత‌ర అంశాల జోలికి ఆయ‌న వెళ్ల‌రు.

కాంగ్రెస్ లో ఉండి కూడా ప్రభుత్వంపై నోరు పారేసుకోకుండా… టు ది పాయింట్ గా స‌మ‌స్య‌ల‌పై ఆయ‌న మాట్లాడే తీరు కేసీఆర్ ను బాగా ఆక‌ట్టుకుంద‌ని స‌మాచారం. దీంతో వంశీ గురించి సీఎం కేసీఆర్ ఆరా తీశార‌ట‌. నియోజ‌క‌వ‌ర్గంలోనూ వంశీకి ఉన్న ఫాలోయింగ్ గురించి అడిగి తెలుసుకున్నార‌ట‌. అందుకే అత‌న్ని పార్టీలోకి తీసుకురావాల‌ని హ‌రీశ్ రావుకు సూచించిన‌ట్టు స‌మాచారం. వెంట‌నే హ‌రీశ్ రావు అండ్ టీం వంశీతో మంత‌నాలు మొద‌లుపెట్టింద‌ట‌. ఆ దిశ‌గా ఆయ‌న‌కు మంచి ఆఫ‌ర్ ఇచ్చార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

టీఆర్ఎస్ ఆఫ‌ర్ కు ఇంకా వంశీచంద్ రెడ్డి స్పందించ‌లేద‌ట‌. కొంత ఆల‌స్య‌మైనా ఆయ‌న టీఆర్ఎస్ లో చేర‌డం ఖాయ‌మ‌ని ఆ పార్టీ ఆశిస్తోంది. మ‌రి వంశీ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి!!!

SHARE