ఢిల్లీ పాలిటిక్స్ పై కేసీఆర్ ఇంట్రెస్ట్!!

Posted February 9, 2017

kcr interested in delhi politics
తెలంగాణ సీఎం కేసీఆర్… ఇక జాతీయ రాజ‌కీయాల్లోకి అడుగుపెడతారా…? ఇక ఆయ‌న ఢిల్లీలో చ‌క్రం తిప్పేందుకు సిద్ధ‌మ‌వుతున్నారా..? వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న పార్ల‌మెంటుకు వెళ్తారా? అంటే ఔన‌నే అంటున్నారు టీఆర్ఎస్ వ‌ర్గాలు.

జాతీయ రాజ‌కీయాల్లో ప్ర‌స్తుతం బ‌ల‌మైన రాజ‌కీయ నాయ‌కుల కొర‌త ఉంది. గ‌తంలో శ‌ర‌ద్ ప‌వార్, జ‌య‌ల‌లిత‌, మ‌మ‌తా బెన‌ర్జీ, నితీశ్ కుమార్, లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ లాంటి నాయ‌కులు ఢిల్లీలో చ‌క్రం తిప్పారు. గ‌త ద‌శాబ్ద‌కాలంగావీరి హ‌వానే కొన‌సాగింది. ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేదు. మోడీ టైమ్ న‌డుస్తున్న త‌రుణంలో నేష‌న‌ల్ పాలిటిక్స్ లో బ‌ల‌మైన నాయ‌కుల సంఖ్య త‌గ్గిపోయింది. ఇందుకు అనేక కార‌ణాలున్నాయి.

శ‌ర‌ద్ పవార్ కు వ‌య‌స్సు మీద ప‌డ‌డంతో ఆయ‌న విశ్రాంతిని కోరుకుంటున్నారు. ఇక జ‌య‌లలిత అకాల మ‌ర‌ణంతో.. త‌మిళ‌నాడు ఇబ్బందుల్లో ఉంది. మ‌మ‌తా బెన‌ర్జీ సొంత రాష్ట్రానికే ప‌రిమిత‌మైపోయారు. నితీశ్ కుమార్ మ‌రోసారి అధికారాన్ని చేప‌ట్టి బీహార్ వ‌ర‌కే గిరిగీసుకున్నారు. అటు లాలూ కూడా ఇప్పుడు దూకుడు త‌గ్గించేసి… త‌న‌యుల‌కు బాధ్య‌త‌లు ఇచ్చేశారు. ఇక ములాయం దాదాపుగా రిటైర్ అయిపోయారు. మాయావ‌తి హ‌వా బాగా త‌గ్గిపోయింది.

స్వ‌త‌హాగా మంచి మాట‌కారి అయిన కేసీఆర్ … జాతీయ రాజ‌కీయాల్లో త‌న‌దైన గుర్తింపును వేయాల‌ని కోరుకుంటున్నారు. అందుకు త‌గ్గ అర్హ‌త‌లు కూడా ఆయ‌నకు ఉన్నాయ‌న్న‌ది విశ్లేష‌కుల మాట‌. కేసీఆర్ కు తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్ పై మంచి ప‌ట్టుంది. ఉద్య‌మ నేత‌గా జాతీయ‌స్థాయి లో అన్ని పార్టీల‌తోనూ గ‌తంలో మంచి సంబంధాల‌ను కొన‌సాగించారు. ఇక తెలంగాణ సాధించిన నాయ‌కుడిగా ఢిల్లీలోనూ ఆయ‌న మంచి ఇమేజ్ ఉంది. ఈ నేప‌థ్యంలో ఢిల్లీకి వెళ్లాల‌ని ఆయ‌న కోరుకుంటున్నారు. మంచి వాగ్ధాటితో పార్ల‌మెంటులోనూ గుర్తింపు తెచ్చుకోవాల‌ని ఆరాట ప‌డుతున్నార‌ట‌. దేశంలోనే బ‌ల‌మైన నాయ‌కుల్లో త‌న‌పేరు వినిపించాలన్న‌ది ఆయ‌న కోరిక అని టాక్.

ఇక ఆయ‌న ఢిల్లీకి వెళ్లేందుకు తెలంగాణ‌లోనూ సానుకూల వాతావ‌ర‌ణ‌మే ఉంది. ఎందుకంటే కేటీఆర్ తండ్రికి త‌గ్గ నేత‌గా గుర్తింపు పొందారు. అటు పార్టీ ఇటు ప్ర‌భుత్వంలో కేటీఆర్ హ‌వా న‌డుస్తోంది. కాబ‌ట్టి కేసీఆర్ లేక‌పోయినా పెద్ద‌గా ఇబ్బందేమీ ఉండ‌దు. అందుకే వ‌చ్చే ఎన్నిక‌ల్లో కేటీఆర్ ను ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా నిల‌బెట్టి…. ఇక తాను జాతీయ‌స్థాయి నాయ‌కుడిగా పేరు తెచ్చుకునేందుకు కేసీఆర్ సిద్ధ‌మ‌వుతున్నార‌ట‌.

అటు టీఆర్ఎస్ శ్రేణులు కేసీఆర్ ఢిల్లీ ఎంట్రీపై సంతోషంగా ఉన్నార‌ట‌. తెలంగాణ‌లో లాగే ఢిల్లీలోనూ ఆయ‌న చ‌క్రం తిప్పుతార‌ని ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నార‌ట‌. మ‌రి కేసీఆర్ క‌ల నెర‌వేరుతుందా.. లేదా అన్న‌ది కాల‌మే స‌మాధానం చెప్పాలి.

SHARE