Posted [relativedate]
పుడితే తెలంగాణలో రైతుగా పుట్టాలి. ఇదేంటి అనుకుంటున్నారా. ఇప్పుడు గులాబీ శ్రేణుల్ని కదిలిస్తే ఇదే మాట చెబుతున్నారు. మొదట రైతులకు రుణమాఫీ చేశారు. తర్వా వడ్డీ మాఫీ చేశారు. ఇప్పుడు ఎకరాలతో సంబంధం లేకుండా రైతులందరికీ ఎరువులు ఫ్రీగా ఇస్తామని కేసీఆర్ ప్రకటించడం తెలంగాణలో సంచలనంగా మారింది. దేశంలోనే మొదటిసారిగా ఎకరాకు నాలుగు వేల చొప్పున ఎరువుల కోసం రైతు ఖాతాల్లో జమచేస్తామన్న కేసీఆర్ ప్రకటనపై ఇతర రాష్ట్రాలు కూడా దృష్టి సారించే అవకాశం కూడా కనిపిస్తోంది.
తెలంగాణలో వ్యవసాయమంటే పండగ అనే పరిస్థితి రావాలని, అన్నదాతలెవరూ కన్నీరు కార్చొద్దని కేసీఆర్ చెబుతున్నారు. అంతా బాగానే ఉన్నా రాష్ట్ర ఖజానాపై పడే భారం సంగతేంటనేది కేసీఆర్ ఆలోచించడం లేదు. అదే మంటే సంపన్న రాష్ట్రం, పరపతి ఉందని కబుర్లు చెబుతున్నారు. ఎంత సంపన్న రాష్ట్రమైనా అనవసరంగా ఖర్చులు చేయడం సరికాదు. ఇలాంటి స్కీముల వల్ల ప్రభుత్వం ప్రచారానికే ఉపయోగం కానీ.. నిజమైన రైతులకు ఒరిగేదేమీ లేదు. ఇప్పటికే రుణమాఫీ విషయంలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి.
ఓవైపు ఎరువుల కంపెనీలకు మోకరిల్లుతూ వాటి అరాచకాల్ని చూసీచూడనట్లు వదిలేస్తున్న ప్రభుత్వాలు.. రైతులకు ఫ్రీగా ఎరువుల పేరుతో ఎవర్ని మోసం చేస్తున్నారని వ్యవసాయ వేత్తలు ప్రశ్నిస్తున్నారు. ప్రతి రైతు ఆర్థిక పరిస్థితి మెరుగై.. ప్రభుత్వానికి చెల్లింపులు చేసే స్తోమత వచ్చేలా విధానాలు చేయడమే నిజమైన ప్రభుత్వ ఉద్దేశం కావాలన్నారు. కానీ రైతుల్ని బిచ్చగాళ్లని చేస్తూ రుణమాఫీలు, ఫ్రీగా ఎరువులు ప్రకటిస్తే ప్రయోజనమేంటని నిలదీస్తున్నారు. కానీ విమర్శల సంగతి ఎలాగున్నా రైతులు మాత్రం పండగ చేసుకుంటున్నారు.