ఆలంపూర్ దగ్గర kcr పుష్కర స్నానం..

   kcr pushkara snanam aalampur

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలంపూర్ కు వెళ్లారు. సీఎం వెంట పలువురు మంత్రులు కూడా ఉన్నారు. శుక్రవారం ఉదయం గొందిమళ్లలో ఏర్పాటు చేసిన వీఐపీ పుష్కర ఘాట్లో స్నానమాచరించి వేదపండితులు ఏర్పాటు చేసి ప్రత్యేక హారతిలో కేసీఆర్ పాల్గొంటారు. అనంతరం వేదపండితుల ఆశ్వీరచనం తీసుకుంటారు. అనంతరం జోగులాంబ దేవాలయాన్ని సందర్శించనున్నారు. మరోవైపు సీఎం పర్యటన సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

ఈ రాత్రికి ఆలంపూర్‌లోని హరిత టూరిజం గెస్ట్ హౌజ్‌లో సీఎం బస చేయనున్నారు. అల్పాహారం తర్వాత ఆలంపూర్ నుంచి హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు బయలుదేరనున్నారు. కాగా, తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా నదికి తొలిసారిగా పుష్కరాలు వస్తున్న విషయం తెలిసిందే. రేపటి నుంచి ఈనెల 23 వరకు పుష్కరాలు కొనసాగనున్నాయి. సుమారు 3 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలను ఆచరిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇటు పవిత్ర కృష్ణా పుష్కరాల కోసం పాలమూరు జిల్లాలోని ఘాట్లు సిద్దమయ్యాయి. పుష్కరుడు కృష్ణానదిలో కలిసే శుక్రవారం నుంచి జిల్లాలోని 52ఘాట్లలో అశేషంగా భక్తులు వచ్చి పవిత్ర స్నానాలు ఆచరించడానికి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. జిల్లాలోని ప్రతీ పుష్కరఘాట్‌ కూడా సుందరంగా ముస్తాబైంది. ముఖ్యంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటాయని భావిస్తున్న బీచ్‌పల్లి, రంగాపూర్, గొందిమళ్ల ఘాట్లలో కళ్లు మిరిమిట్లు గొలిపే విధంగా ఏర్పాట్లు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న తొలిపుష్కరాలు కావడంతో ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

SHARE