ఎన్టీఆర్ ని ఆకాశానికి ఎత్తిన కెసిఆర్ ..అందుకేనా?

Posted October 5, 2016

   kcr remembering ntr ruling
ఎన్టీఆర్ అంటే ఉన్న అభిమానం కొద్దీ కొడుక్కి తారక రామారావు అని పేరు పెట్టారని తెలంగాణ సీఎం కెసిఆర్ గురించి ఎంతో మంది చెప్పే మాట.ఆ విషయం మీద ఎప్పుడూ నోరు విప్పలేదు అయన.అయితే ఆయనకి ఎన్టీఆర్ మీదున్న అభిమానం మాత్రం బయటపడింది.కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా అధికార వికేంద్రీకరణ ఎంత అవసరమో కెసిఆర్ వివరించారు.మండలాల ఏర్పాటు వల్ల పాలనా సౌలభ్యం పెరిగిందని ..ఆ ఫలాలన్నీ ఎన్టీఆర్ చలవేనని కెసిఆర్ వ్యాఖ్యానించారు.అప్పట్లో మండల విధానం మీద ఎన్ని విమర్శలొచ్చినా ఎన్టీఆర్ ధైర్యంగా ముందుకెళ్లిన విషయాన్ని కెసిఆర్ గుర్తు చేసుకున్నారు.మండల విధాన రూపకల్పన కమిటీ లో తాను కూడా ఓ సభ్యుడినని చెప్పుకున్నారు.

కెసిఆర్ వ్యాఖ్యలకి టీడీపీ శ్రేణులు చంకలు గుద్దుకుంటున్నాయి.కానీ కెసిఆర్ కావాలని ఈ వ్యాఖ్యలు చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.తెలంగాణాలో ఇక తెలుగుదేశం మనలేదని భావిస్తున్న కెసిఆర్..ఆ పార్టీ కి దన్నుగా నిలుస్తున్న ఓ సామాజిక వర్గాన్ని చేరదీసేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శకుల అభిప్రాయం.రానున్న రోజుల్లో కాంగ్రెస్,రెడ్లని రాజకీయంగా ఎదుర్కోడానికి సామాజికంగా,ఆర్ధికంగా బలమైన కమ్మల్ని ఆకర్షించడానికి కెసిఆర్ వ్యూహాత్మకంగా ఈ ఎత్తుగడ వేశారంటున్నారు.ఇదే నిజమైతే ఎన్టీఆర్ ని పొగిడి కూడా టీడీపీని దెబ్బ కొట్టొచ్చని కెసిఆర్ నిరూపించినట్టే.

SHARE