మోడీ కూడా పొగిడారు…కేసీఆర్

 kcr said modi appreciated

సంక్షేమ రంగంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత విద్యకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. నాలుగు నెలల్లో ఛత్తీస్గఢ్ నుంచి వెయ్యి మెగావాట్ల విద్యుత్ను పొందుతామన్నారు. దసరా పండుగకు కొత్త జిల్లాల ఏర్పాటు చేస్తున్నామని సీఎం ప్రకటించారు.

తెలంగాణ ప్రభుత్వం 70వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను గోల్కొండ కోటలో సోమవారం ఘనంగా నిర్వహించింది. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక మూడోసారి వేడుకలను కూడా గోల్కొండలోనే జరుపుకుంటున్నందుకు ఆనందంగా ఉందన్నారు.

అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లడమే ప్రధాన లక్ష్యంగా సర్కార్ పనిచేస్తోందని సీఎం కేసీఆర్ తెలిపారు. బీసీలు, ఈబీసీలకు కల్యాణలక్ష్మి పథకం వర్తింపు చేస్తున్నట్లు చెప్పారు. .

తెలంగాణ ప్రభుత్వ పని తీరును ప్రధాని మోడీ ప్రశంసించారన్న విషయాన్ని గుర్తు చేశారు. బాలారిష్టాలు ఒక్కొక్కటిగా అధిగమిస్తూ.. స్థిర పాలన అందిస్తున్నామని… సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుతో దేశం దృష్టిని తెలంగాణ ఆకర్షిస్తోందన్నారు. సంక్షేమ రంగంలో రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని.. ఇంటింటికీ తాగు నీటి పథకాన్ని ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభించామన్నారు. పొరుగు రాష్ర్టాలతో సన్నిహితంగా ఉంటూ…. రామగుండం ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణతో ఇక్కడి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు.

నీటి పారుదల, విద్యుత్ రంగంలో ఇతర రాష్ర్టాలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంటున్నామని… ఛత్తీసగఢ్ నుంచి నాలుగు నెలల్లో వెయ్యి మెగావాట్ల విద్యుత్ అందుతుందని..దీంతో విద్యుత్ కష్టాలు తీరతాయన్నారు. గోదావరిపై ప్రాజెక్టుల నిర్మాణానికి మహారాష్ట్రతో 23న ముంబయిలో చారిత్రక ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు సీఎం తెలిపారు. కర్ణాటక ప్రభుత్వంతో స్నేహసంబంధాలు బలపడ్డాయని.. ఆర్డీఎస్ పనులు వేగవంతం చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం సహకరిస్తోందని చెప్పారు.

సాగునీటి ప్రాజెక్టులన్నీ సకాలంలో పూర్తి చేసి…పాలమూరు జిల్లాలో 6 లక్షల ఎకరాలకు నీరు అందిస్తామన్నారు. కల్యాణలక్ష్మీ పథకం బీసీ, ఈబీసీలకు వర్తింపజేస్తామని సీఎం తెలిపారు. అంతకు ముందు కేసీఆర్…సికింద్రాబాద్లో అమరవీరుల, సైనిక స్మారక స్థూపానికి నివాళులర్పించారు.తర్వాత పంద్రాగస్టు వేడుకల్లో సీఎం ఉత్తమ అవార్డులను అందచేశారు

SHARE