Posted [relativedate]
మంత్రివర్గంలో మహిళలకు స్థానం ఇవ్వలేదనే విమర్శలు మూటగట్టుకున్న సీఎం కేసీఆర్.. ఇప్పుడా విమర్శలను కవర్ చేసుకునే పనిలో ఉన్నారు. ఎలాగూ మహిళలకు మినిస్ట్రీ ఇవ్వొద్దని డిసైడ్ అయిపోయినట్టున్నారు. అందుకే కనీసం నామినేటెడ్ పోస్టుల్లోనైనా సముచిత ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.
టీఆర్ఎస్ లో మొదటి నుంచి ఉన్న మహిళా నాయకులకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారట కేసీఆర్. అందుకోసం ముగ్గురితో ఒక కమిటీని వేశారు. ఈ కమిటీలో డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, ఎంపీ కవిత, కరీంనగర్ జడ్పీ ఛైర్ పర్సన్ తుల ఉమకు స్థానం కల్పించారు. ఈ ముగ్గురూ మహిళా నాయకులపై ఒక రిపోర్ట్ తయారు చేసి కేసీఆర్ కు రిపోర్ట్ ఇస్తారట. ఆ రిపోర్టు ప్రకారం మహిళలకు పదవులు ఇవ్వబోతున్నట్టు టాక్.
కేసీఆర్ వేసిన ఈ ఎత్తుగడ ఫలిస్తుందా అన్నది ఇప్పుడు చర్చకు దారి తీస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు కావస్తోంది. ఇన్నాళ్లకు మహిళలు గుర్తుకొచ్చారా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కానీ టీఆర్ఎస్ వాదన మాత్రం మరోలా ఉంది. మహిళలకు నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యం ఇవ్వాలన్న ఆలోచన ఇతర పార్టీలకు ఎప్పుడైనా వచ్చిందా అని ఎదురు ప్రశిస్తున్నారు గులాబీ నేతలు.
అయితే టీఆర్ఎస్ లోని మహిళా నేతలు మాత్రం కేసీఆర్ పై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. పదవుల విషయంలో చాలా ఆలస్యం చేశారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ ఇచ్చేదేదో ప్రభుత్వం ఏర్పడినప్పుడే నామినేటెడ్ పోస్టులిచ్చేస్తే… ఇంత రచ్చ జరిగేది కాదు కదా అన్న వాదన వినిపిస్తోంది. నిజమే మరి…! ఎలాగూ మహిళలకు మినిస్ట్రీ ఇవ్వొద్దని నిర్ణయించుకున్నారు. ఆ ఇచ్చే పదవులేవో.. అప్పుడే ఇచ్చేస్తే.. పేరుకు పేరు వచ్చేది. మహిళా నేతలు కూడా సంతృప్తి చెందేవారు. ఆలస్యం అమృతం విషం అన్నది కేసీఆర్ కు తెలియనట్టుంది.!!