కారు సర్వేలు భయపెడుతున్నాయా..?

Posted April 5, 2017

kcr survey in telanganaతెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రస్తుతానికి ఎదురులేదు. పంచాయతీ ఎన్నికల దగ్గర్నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల దాకా ఎక్కడ చూసినా కారు జోరే కనిపిస్తోంది. పైకి అంతా బాగానే ఉంది. కానీ ఇటీవల కాలంలో ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరుపై కేసీఆర్ సర్వేలు చేశారు. బాగున్నవారికి కితాబిచ్చారు. వెనుకబడ్డవారికి క్లాసులు పీకారు. కొన్ని జిల్లాల్లో టీఆర్ఎస్ మరీ బలహీనంగా ఉందన్న తత్వం కూడా కేసీఆర్ కు బోధపడిందట. ప్రజాప్రతినిధుల పనితీరు ఇలాగే ఉంటే.. గత ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చిన జిల్లాల్లో కూడా ఈసారి విపక్షం బలం పుంజుకుంటుందని గులాబీ బాస్ సర్వేల్లో తేలిందట.

ఇక లాభం లేదనుకున్న కేసీఆర్.. మరోసారి తురుపుముక్క కేటీఆర్ ను రంగంలోకి దించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఘనవిజయంతో మంచి ట్రాక్ రికార్డు ఉన్న కేటీఆర్.. పార్టీ బలహీనంగా ఉన్న జిల్లాల్లో కూడా ఊపు తెస్తారని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే ముందుగా ఉమ్మడి పాలమూరు జిల్లా పరిధిలో కేటీఆర్ రెండురోజులుగా బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. పేరుకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిశీలనకు వెళ్లినట్లే ఉన్నా.. అసలు విషయం మాత్రం సర్వేల్లో వచ్చిన ఫలితాలేనని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

డబుల్ బెడ్రూమ్ ఇళ్లను విపక్షాలు హైలైట్ చేస్తుండటంతో అనుకున్న విధంగా హామీలు నెరవేర్చలేదని ప్రజల్లో కూడా అసంతృప్తి మొదలైందని కేసీఆర్ గుర్తించినట్లు తెలుస్తోంది. అందుకే అసంతృప్తి అసమ్మతిగా మారకముందే కేటీఆర్ ను రంగంలోకి దించారు. మరోవైపు కాంగ్రెస్ కూడా సమరానికి సై అంటూ సంకేతాలు ఇవ్వడంతో.. ఎవరికీ అందనంత వేగంగా తాము దూసుకుపోవాలని గులాబీ బాస్ ప్లాన్ చేశారు. అందుకే దూకుడుగా మాట్లాడే కేటీఆర్ తో సభలు పెట్టిస్తున్నారు. ఇన్నేళ్ల అసమర్థ పాలనకు కాంగ్రెస్సే కారణమని కేటీఆర్ కూడా ఊదరగొడుతున్నారు. ఇప్పుడు ఏ ఎన్నికలు లేవు కదా.. కేటీఆర్ ఎందుకు ఇంత ధాటిగా ప్రసంగిస్తున్నారని సందేహాలు వచ్చినవారికి.. అసలు విషయం తెలిసి ఆశ్చర్యపోతున్నారు.

SHARE