Posted [relativedate]
ఎలాగోలా ఏపీలో కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ జరిగిపోయింది. దీంతో ఇప్పుడు తెలంగాణలో ఎప్పుడు ఆ ముహూర్తం అన్న చర్చ జరుగుతోంది. తెలంగాణ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ జరిగితే పరిస్థితి ఏంటన్న వాదన వినిపిస్తోంది.
ఏపీలో చంద్రబాబు అన్ని కులాలు, జిల్లాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించేందుకు స్ట్రాంగ్ ఎక్సర్ సైజ్ చేశారు. ఈ సమీకరణాల దృష్ట్యా కొందరు సీనియర్లకు మొండిచేయి చూపారు. ప్రస్తుతానికి ఆయా నేతలు అసంతృప్తి గళం వినిపిస్తున్నా… చంద్రబాబు వారిని తనదారిలోకి తెచ్చుకోవడానికి ఎక్కువ టైం పట్టదు. అయితే తెలంగాణలో పునర్ వ్యవస్థీకరణ జరిగితే పరిస్థితి ఏంటని కేసీఆర్ ఆలోచిస్తున్నారట.
ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణలో కేబినెట్ లో మార్పులు- చేర్పులు చేయాల్సి వస్తే పెద్ద రచ్చ కావడం ఖాయం. ఎందుకంటే ఆశావహులు చాలామందే ఉన్నారు. కేబినెట్ లో ఇప్పటిదాకా మహిళలకు ప్రాతినిధ్యం లేదు. ఇక ఎస్టీ కోటాలో చాలామంది ఆశిస్తున్నారు. బీసీ ఎమ్మెల్యేలు చాలామంది ఆశావహుల జాబితాలో ఉన్నారు. రెడ్డి కోటాలో మరికొందరు రెడీగా ఉన్నారు. ఇక మార్పులు- చేర్పుల్లో భాగంగా కొందరికి వేటు వేయక తప్పుదు. కాబట్టి ఇవన్నీ జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందోనని కేసీఆర్ టెన్షన్ పడుతున్నారట. కేబినెట్ లో మార్పులు – చేర్పులు చేస్తే… అసంతృప్తిని తట్టుకోగలమా? లేదా ? అని లెక్కలు వేసుకుంటున్నారట.
ఏపీలోలాగా కాకుండా అసంతృప్తులకు ముందే తగిన భరోసా ఇచ్చి… కేబినెట్ ను పునర్ వ్యవస్థీకరించాలన్న నిర్ణయానికి కేసీఆర్ వచ్చారట. అందులో భాగంగా ప్రాధాన్యమున్న నామినేటెడ్ పోస్టులను ముందు ప్రకటిస్తారట. ఆ తర్వాత కేబినెట్ ను పునర్ వ్యవస్థీకరిస్తారట. అయితే అనుకున్నంత ఈజీగా అది జరుగుతుందా? అన్నది చూడాలి. ఎందుకంటే ప్రస్తుతానికి తెలంగాణలో టీఆర్ఎస్ కు ఎదురులేదు. ఒకవేళ కేబినెట్ ను పునర్ వ్యవస్థీకరిస్తే… చోటు దక్కని వారు పార్టీ మారే అవకాశాలు లేకపోలేదు. అదే జరిగితే టీఆర్ఎస్ కు కొంచెం ఇబ్బందే. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీకి ఈ పరిణామాలు కలిసొచ్చే అవకాశముంది. కాబట్టి వీటన్నింటినీ కేసీఆర్ ఎలా హ్యాండిల్ చేస్తారన్నది చర్చనీయాంశంగా మారింది.