Posted [relativedate]
తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ టీడీపీ నుంచి గెలిచి.. ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరారు. అప్పట్లో తలసాని లాంటి నాయకుడి అవసరం టీఆర్ఎస్ కు ఎక్కువగా ఉంది. ఇక మంత్రి పదవి ఆఫర్ చేశారు కాబట్టి తలసాని కూడా కారెక్కేశారు. కానీ ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించింది. రికార్డు మెజార్టీతో గ్రేటర్ ను వశం చేసుకుంది. అయితే గ్రేటర్ ఎన్నికల్లో తలసాని పెద్దగా టీఆర్ఎస్ కు ఉపయోగపడలేదని కేసీఆర్ భావిస్తున్నారట. ఎందుకంటే ఆ ఎలక్షన్స్ లో తెలంగాణ ప్రభుత్వ పనితీరు వల్లే… గులాబీని జనం అక్కున చేర్చుకున్నారు. దీనికి మంత్రి కేటీఆర్ ప్రచారం కూడా కలిసొచ్చింది.
గ్రేటర్ ఎన్నికల తర్వాత తలసాని తీరుపై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రతిపక్షాలు కూడా ఆయనను మంత్రి వర్గంలోకి ఎలా తీసుకున్నారని ప్రశ్నిస్తున్నాయి. ఇకమంత్రిగానూ ఆయన పెద్దగా ప్రభావం చూపలేకపోయారన్న వాదన ఉంది. సరిగ్గా ఇదే సమయంలో మంత్రి పదవి ఆశావహులు చాలా మంది ఉన్నారు. తెలంగాణ గొంతుకను ఏనాడు వినిపించని తలసానికి మంత్రి పదవి ఇచ్చి… తమకెందుకు అవకాశం ఇవ్వడం లేదని వారంతా కేసీఆర్ పై ఒత్తిడి పెంచుతున్నారు.
తలసానిపై రోజురోజుకు విమర్శలు పెరుగుతుండడంతో సీఎం కేసీఆర్ కూడా ఆయనపై గుస్సాగా ఉన్నారట. అసలు ఈయనను మంత్రిపదవి నుంచి తప్పిస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారట. ఆ దిశగా ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నారట. తలసాని స్థానంలో ఇంకొక సమర్థ నాయకుడికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారట. అయితే సరైన కారణం కోసమే వెయిటింగ్ చేస్తున్నారని సమాచారం. అది ఎప్పుడు అనేది త్వరలోనే తేలిపోతుందని టీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు.