ఖైదీ నెంబర్ 150 రివ్యూ …పబ్లిక్ పల్స్

138

Posted January 11, 2017, 12:25 pm

khaidi no 150 movie review
దాదాపు పదేళ్ల తర్వాత వెండి తెరపై మెగా స్టార్ రీఎంట్రీ ఇచ్చిన చిత్రం ఖైదీ నెంబర్ 150 . ఇప్పటికే చాలా చోట్ల ఈ సినిమా షో లు పడ్డాయి.కొన్ని చోట్ల ఫస్ట్ షో పూర్తి కూడా అయిపోయింది.చిరు తనయుడు రామ్ చరణ్ నిర్మాతగా…మాస్ దర్శకుడు,ఠాగూర్ లాంటి భారీ హిట్ ఇచ్చిన దర్శకుడు వి.వి.వినాయక్ దర్శకుడిగా రూపొందిన ఖైదీ నెంబర్ 150 చిత్రం ఎలా ఉందో చూద్దాం.

స్టోరీ లైన్…

జైలు నుంచి పారిపోయిన ఓ ఖైదీ రూపంలో తనలా వున్న ఓ సామాజిక కార్యకర్త లా కార్పొరేట్ కబంధ హస్తాల నుంచి రైతుల్ని,వారి భూముల్ని,వారికి అందాల్సిన నీటిని కాపాడేందుకు ప్రయత్నిస్తాడు.నిజంగా రైతుల కోసం పని చేస్తున్న ఆ సామాజిక కార్యకర్తని పోలీసులు అరెస్ట్ చేస్తారు.ఈ సందిగ్ధం వారిద్దరూ తమ తమ ఇబ్బందుల్ని అధిగమిస్తూ రైతుల సమస్యని ఎలా అధిగమించారన్నదే మూల కథ. దీన్ని రెండున్నర గంటల్లో ఎలా చెప్పారన్నది వివిధ కోణాల్లో చూద్దాం.

విశ్లేషణ…

విజయ్ నటించిన కత్తి తమిళ్ సినిమాకి రీమేక్ ఖైదీ నెంబర్ 150 . మురుగదాస్ కధకుడు. అంతకుముందు చిరు,వినాయక్ కాంబినేషన్ లో వచ్చిన ఠాగూర్ కథ కూడా ఆయనదే.ఇక అన్ని భాషల్లో భారీ హిట్ అందుకున్న గజిని కధా ఆయనదే…ఈ మూడు కధల్ని జాగ్రత్తగా చూస్తే ఓ విషయం అర్ధమవుతుంది.ఓ సామాజిక సమస్యని నిజాయితీగా ఓ కధలో ఇమిడిపోయేలా చేస్తారు అయన.ఆ క్రమంలో అక్కడక్కడా వినోదం పుడుతుంది.అది కూడా కధలో భాగంగా.ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే మురుగదాస్ కథలకి ఆత్మ ఎలా ఉంటుందో చెప్పేందుకు. అయన కథని చిరు,వినాయక్ ఠాగూర్ గా తీర్చిదిద్దినప్పుడు ఆ ఆత్మ మిస్ కాకుండా సక్సెస్ అయ్యారు.నిజాయితీగా కధా గమనానికి ప్రాధాన్యమిచ్చి ముందుకెళ్లారు.ఖైదీ నెంబర్ 150 విషయంలో మాత్రం ఒరిజినల్ కత్తి లో లేనిదేదో ఇందులో ఇమిడ్చేందుకు ట్రై చేశారు.అదనపు వినోదాన్ని జోడించారు. కధని చెప్పడం మీద పెట్టిన దృష్టి ఎంత ఉందో …ఇది మెగా స్టార్ కమ్ బ్యాక్ ఫిలిం అన్న విషయానికి అంతకన్నా ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు.ఆ రెండు థ్రెడ్స్ మధ్య అల్లిక అందంగా వుండాల్సింది పోయి …మెగా స్టార్ ఫాన్స్ కోసం అన్న అంశం ఈ కథని డామినేట్ చేసింది.దీంతో ఇది బాగా తీయలేదని ఎక్కడా అనిపించలేదు ..కానీ మెగా స్టార్ సూపర్ కదా అనిపించినన్ని సార్లు కథ,అందులో సన్నివేశాలు చూస్తున్నప్పుడు అనిపించలేదు.దీన్ని ఓ సాధారణ ప్రేక్షకుడు లోపం అనుకోవచ్చు .ఓ మెగా స్టార్ ఫ్యాన్ అదిరిపోయింది అనుకోవచ్చు.ఎవరి దృష్టి కోణం నుంచి వాళ్ళు చూడొచ్చు.అయితే ఆ ఇద్దరిలో ఏ ఒక్కరూ పూర్తి సంతృప్తిగా,పూర్తి అసంతృప్తిగా థియేటర్ నుంచి బయటకు వెళ్లే పరిస్థితి లేదు.

నటీనటులు…..

వెండి తెర మీద కనిపించి పదేళ్లు అయినా మెగా స్టార్ లో ఏ మాత్రం స్క్రీన్ ప్రెజన్స్ తగ్గలేదు.వయసు,అనుభవం తో వచ్చిన పరిణితి బోనస్..డాన్స్,ఫైట్ ల విషయంలో ఏ మాత్రం గ్రేస్ తగ్గలేదు.ఓ 60 ఏళ్ల వ్యక్తి ఇలా డాన్స్ చేయడం ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటికి చిరుకి మాత్రమే సాధ్యం అనుకోవాలి.కాజల్ ,అలీ,బ్రహ్మానందం,విలన్ పాత్రధారి తరుణ్ అరోరా ఇలా అందరూ తమ పాత్రలకి న్యాయం చేశారు.

సాంకేతిక నిపుణులు…

ఈ సినిమాకి పనిచేసిన సాంకేతిక నిపుణులంతా అగ్రశ్రేణి వాళ్ళే.కెమెరా మెన్ రత్నవేలు,సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్,ఎడిటర్ గౌతమ్ రాజు,రచయితలు పరుచూరి బ్రదర్స్,బుర్రా సాయి మాధవ్,వేమా రెడ్డి,ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్,కొరియో గ్రాఫెర్స్ లారెన్స్,శేఖర్,జానీ మాస్టర్ ఇలా అందరూ తమ పరిధిలో బాగా చేశారు.అయితే ప్రతి ఒక్కరూ ఖైదీ నెంబర్ 150 కోసం కన్నా చిరు 150 వ సినిమాకి పనిచేసినట్టే కనిపించింది.దీన్ని పాజిటివ్ అనుకుంటే పాజిటివ్ ..నెగటివ్ అనుకుంటే నెగటివ్.

తెలుగు బులెట్ పంచ్ లైన్ అండ్ రేటింగ్ …… ఖైదీ నెంబర్ 150 కామెడీగా కత్తి దింపేశాడు.
రేటింగ్ …. 3 / 5 .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here