బాలయ్య ఒప్పుకున్నాడా..తప్పుబట్టాడా?

Posted February 1, 2017

khaidi number150 crossed sathakarni records
సంక్రాంతి రేసులో ఖైదీ నెంబర్ 150 ,గౌతమి పుత్ర శాతకర్ణి ఏ రేంజ్ లో ఢీకొట్టాయో అందరికీ తెలిసిందే.రెండు సినిమాలు విజయవంతం కావడంతో అంతా హ్యాపీ అనుకున్నా అలా జరగలేదు. కలెక్షన్స్ గురించి పోటీ మొదలైంది.ఈ విషయంలో ప్రెస్ మీట్ పెట్టి మరీ ఖైదీ నెంబర్ 150 టీం భారీ ప్రచారం చేసింది.అటు శాతకర్ణి టీం కలెక్షన్స్ గురించి కన్నా కంటెంట్ మీదే ఎక్కువ దృష్టి పెట్టింది. అయితే బయటికి జరిగిన ప్రచారం మాటెలా వున్నా ఐటీ శాఖ ఖైదీ నెంబర్ 150 నిర్మాతల జోలికెళ్లకుండా శాతకర్ణి ప్రొడ్యూసర్స్ ని టార్గెట్ చేసింది.ఈ పరిణామాలన్నీ ఎలా వున్నా ఇప్పటికి అధికారికంగా శాతకర్ణి టీం కలెక్షన్స్ విషయం బయట పెట్టింది లేదు.ఈ టైం లో టి.సుబ్బిరామిరెడ్డి ఇచ్చిన ఓ పార్టీలో బాలయ్య సంక్రాంతి సినిమాల పోటీ గురించి మాట్లాడి సరికొత్త చర్చకు తెర లేపాడు.

” ఈ పండగకి విడుదలైన సినిమాల్లో ఏది ఎక్కువ కలెక్షన్స్ సాధించిందో అందరికీ తెలుసు.అయితే నాకు కలెక్షన్స్ గురించి ,నంబర్స్ గురించి పట్టింపు లేదు.నా సినిమాలని ఎక్కడ పెట్టాలో అభిమానులకు తెలుసు .నాకు అభిమానులే అన్నీ ” అని బాలయ్య అన్న మాటలకి అర్ధం వెదికే పనిలో పడ్డారు ఫిలిం నగర్ జీవులు.ఆ మాటల్ని బట్టి శాతకర్ణి కన్నా ఖైదీ నెంబర్ 150 కి ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయని బాలయ్య ఒప్పుకున్నట్టు కొందరు భాష్యం చెప్తున్నారు.అందుకే పోటీ గురించి పట్టింపు లేదని బాలయ్య అన్నట్టు వాళ్ళు వాదిస్తున్నారు.ఇక రెండో వైపు వాదించేవాళ్ళు ఖైదీ నెంబర్ 150 టీం ఆర్భాటపు ప్రకటనలు చేసిందని బాలయ్య సెటైర్ వేసినట్టు చెప్పుకుంటున్నారు.మొత్తానికి నేరుగా విషయం చెప్పకుండా బాలయ్య ఇంకో చర్చకు తెర లేపాడు.

SHARE