ఉత్తరాంధ్ర జిల్లాల్లో క్లీన్ ఇమేజ్ ఉన్న నేతల్లో కిషోర్ చంద్ర దేవ్ పేరు ముందుంటుంది.వివిధ రంగాల్లో ఆయనకున్న అవగాహన అపారం.మేధావి గా పేరున్న కిషోర్ కన్ను కమలం మీద పడినట్టు సమాచారం.కాంగ్రెస్ కి ఇక ఆంధ్రప్రదేశ్ లో భవిష్యత్ లేదన్న అంచనాతోటే ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్టు అనుచరులు చెబుతున్నారు.మరో వాదన కూడా ప్రముఖంగా వినిపిస్తోంది.కాంగ్రెస్ హై కమాండ్ రాష్ట్ర వ్యవహారాలకు సంబంధించి పూర్తిగా కేవీపీ మాటనే వినడం కిషోర్ కి నచ్చడం లేదని ఓ వాదన వినిపిస్తోంది.
కిషోర్ కి కమలం పార్టీ ఆహ్వానం అయితే పలికింది తప్ప భవిష్యత్ మీద ఏ విధమైన హామీ ఇవ్వడానికి ఇష్టపడటంలేదు.ముందు వచ్చి పని చేస్తే తరువాత ఆలోచిద్దాం అని రాష్ట్ర బీజేపీ ముఖ్యుడు కిషోర్ తో జరిపిన చర్చల్లో చెప్పారట .దీంతో అయన సందిగ్ధంలో పడ్డారు.అదే సమయంలో కొందరు సహచరులు ఆయనకు జనసేన గురించి ఆలోచించమని సలహా ఇచ్చారట.
ఇప్పుడిప్పుడే పురుడుపోసుకుంటున్న ఆ పార్టీకి మేధోపరమైన అవసరాలు ,విధాన నిర్ణయాలకు సంబంధించి కిషోర్ సేవలు ఉపయోగపడతాయని అటు జనసేన వర్గాలకి కూడా ఓ ఫీలర్ వెళ్లిందట.అయితే ప్రస్తుతానికి ఆ దిశగా ఇంకా నిర్మాణాత్మక అడుగులు పడలేదని చెప్పాలి.నిజాయితీ పరుడైన ఓ రాజకీయ వేత్త పార్టీ మారడం కష్టమే అవుతోందని అయన అనుచరులు బాధపడుతున్నారు .