Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం మరోమారు మండిపడ్డారు. సీఎం కేసీఆర్ కాంట్రాక్టర్లకు ఇష్టుడిగా – ప్రజల కష్టాలను పట్టించుకోని వ్యక్తిగా మారిపోయాడని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ – మంత్రి హరీశ్ రావు ఇలాకా అయిన సిద్దిపేట జిల్లాకు చెందిన సమగ్రాభివృద్ధిపై సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన సభకు ముఖ్య అతిథిగా హాజరైన కోదండరాం ప్రభుత్వం తీరుపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో జరుగుతున్న రైతు ఆత్మహత్యల్లో ముఖ్యమంత్రి సొంత జిల్లా సిద్దిపేటలోనే ఎక్కువ ఉన్నాయని కోదండరాం ఆరోపించారు. మెట్ట రైతులను ఆదుకోవడానికి అన్ని చెరువులనూ నింపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గతంలో బావులు – చెరువులతోనే వ్యవసాయం చేసేవారని – 1995 నుంచి బోర్లతో పండించడం మొదలైందని అన్నారు. సాగు కోసం రైతులు చేస్తున్న అప్పుల్లో 40శాతం బ్యాంకుల నుంచి – 60శాతం ప్రయివేటుగా తెస్తున్నారని కోదండరాం అన్నారు. వరుస కరువుతో పంటలు పండక అప్పులు తీర్చే పరిస్థితి లేకే రైతులు అత్మహత్య చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
కంది – పత్తి – మిరప వంటి పంటలకు కూడా ప్రభుత్వం మద్దతు ధర ఇవ్వడం లేదని కోదండారం ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను వ్యాపారులు నిండా ముంచుతుంటే పట్టించుకోని పోలీసులు.. నష్టపోతున్న రైతులను పరామర్శించడానికి వెళ్తున్న తమను వివిధ సంఘాల నాయకులను అడ్డుకోవడం అన్యాయమన్నారు. అదే సమయంలో కాంట్రాక్టర్లపై ప్రభుత్వం తెగ ప్రేమ చూపిస్తోందని కోదండరాం ఆరోపించారు. పాత పైప్ లైన్లు మార్చి కొత్తవి వేయడం వేసిన రోడ్లపైనే మళ్లీమళ్లీ పనులతో కాంట్రాక్టర్లకు మేలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.