కృష్ణా తీరం ఆధ్యాత్మిక హారం..

0
638

  krishna pushkaraalu god grace

కృష్ణాతీరం ఎన్నో పవిత్ర క్షేత్రాలకు నెలవైంది. మహార్రాష్టలోని సహ్యాద్రి కనుమల్లో పుట్టిన కృష్ణమ్మ మన రాష్ట్రంలోని హంసలదీవి నుంచి సముద్రంలో కలిసే ప్రాంతం వరకు అనేక పుణ్యక్షేత్రాలు కొలువై ఉన్నాయి. భారతదేశంలో అతిపెద్ద మూడో పెద్ద నది కృష్ణానది. కృష్ణానది జన్మస్థలం మహార్రాష్టలోని పశ్చిమ కనుమలలోని మహాబలేశ్వరం. కృష్ణానది మొత్తం పొడవు 1440 కిలోమీటర్లు. కృష్ణానది మహార్రాష్ట, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది.

కృష్ణానది తెలంగాణలో మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో, ఆంధ్రప్రదేశ్ లో కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ప్రవహిస్తుంది. కృష్ణా నదికి తుంగభద్ర, పాలేరు, మున్నేరు, మలప్రభ, కోయినా, దిండి, మూసీ, ఘటప్రభ, భీమా, దూద్ గంగా ఉపనదులున్నాయి. కృష్ణానదీ తీరాన పలు పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైల క్షేత్రం మహిమాన్వితమైనది. అష్టాదశ శక్తిపీఠమైన విజయవాడలో కనకదుర్గ ఆలయంతోపాటు, అమరావతి, మోపిదేవి ముఖ్యమైనవి. ఇవి కాకుండా అనేక దేవాలయాలు కృష్ణా తీరంలో కొలువై ఉన్నాయి.

శ్రీశైల క్షేత్రం ప్రాశస్త్యం…
కోరిన కోర్కెలు తీర్చుతూ భక్తుల కొంగు బంగారమై శ్రీశైలపర్వత శిఖరముపై భ్రమరాంబికా సమేతుడై మల్లిఖార్జున స్వామికొలువుదీరి ఉన్నాడు. ఎంతో విశేషమైన ఈ క్షేత్రం భారతదేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ముఖ్యమైనది. అలాగే అష్టాదశ శక్తి పీఠాల్లో భ్రమరాంబికా అమ్మవారి పీఠం ఒకటి.ఇక్కడ స్వామి వారు స్వయంభువుగా వెలిసారు. శ్రీశైల క్షేత్రాన్ని దక్షిణ కాశీ అనే పిలుస్తారు. ఈ పుణ్య క్షేత్రాన్ని ఒక్కసారి దర్శిస్తే చాలు చేసిన పాపాలన్ని సమసిపోయి ముక్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. కృష్టా నదీ తీరంలో సముద్రమట్టానికి 1500 అడుగుల ఎత్తులో ఉండగా, శ్రీశైల శిఖరం సముద్రమట్టానికి 2300 అడుగుల ఎత్తులో ఉంది. పుష్కరాల నేపథ్యంలో శ్రీశైలం సమీప ప్రాంతాల్లో పలు ఘాట్లను అభివృద్ధి పరచారు. ముఖ్యంగా లింగాల ఘాట్, పాతాళ గంగ ఘాట్ల వద్దకు భక్తులు పెద్ద ఎత్తున చేరుకొని పవిత్రస్నాస్నానాలు ఆచరించేందుకు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. లింగాల ఘాట్ వద్ద మూడు పుష్కర నగర్ లను ఏర్పాటు చేశారు. శ్రీశైలం నుంచి పాతాళగంగ చేరుకునేందుకు బస్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఇక్కడ్నుంచి శ్రీశైలంలోని సమీప పుణ్యక్షేత్రాలను తేలిగ్గా చేరుకోవచ్చు.
బెజవాడ కనకదుర్గమ్మ చరిత్ర ఇదీ…

దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా అఖిలాంద్రకోటి బ్రహ్మండాలను కాపాడుతూ బెజవాడ లోని ఇంద్రకీలాద్రి మీద కొలువై భక్తులు కోరికలు కోరిందే తడువుగా వారి కోరికలను తీర్చుతున్న అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆదిపరాశక్తి కనకదుర్గమ్మ తల్లి. ఈ ఆలయంలోని అమ్మ స్వయంభుగా వెలసిందని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాక శ్రీ శక్తి పీఠాల్లో ఈ ఆలయం ఒకటి. ఇక విజయవాడ పరిసర ప్రాంతాల్లో 24 ఘాట్లను అందుబాటులోకి తెచ్చారు. ఇబ్రహీంపట్నం వద్ద పవిత్ర సంగమ ఘాట్, పవిత్ర సంగమానికి అనుకొని హారతి పెవిలియన్ ఘాట్ దాటిన తర్వాత ఫెర్రీ ఘాట్ నిర్మాణం చేశారు. విజయవాడలో పున్నమి, భావానీ ఘాట్లను కలిపి మహాఘాట్ గా నామకరణం చేశారు. ఈ ఘాట్ మొత్తం 400 మీటర్ల మేర వ్యాపించి ఉంది. ప్రకాశం బ్యారెజ్ నుంచి కనకదుర్గమ్మ అమ్మవారి గాలిగోపురం వరకు దుర్గ ఘాట్ నిర్మించారు. కృష్ణవేణి ఘాట్ వద్ద జల్లు స్నానానికి ఏర్పాట్లు చేశారు. పద్మావతి ఘాట్ వద్ద 1.1 కిలోమీటర్ల మేర పుష్కర స్నానాలను ఏర్పాట్లు చేశారు.

పుణ్యతీర్థం అమరావతి…
గుంటూరు జిల్లాలో కృష్ణానదీ తీరాన వెలసిన పుణ్యతీర్థం శ్రీ అమరారామం. ఈ క్షేత్రాన్నే మనం అమరావతి అని పిలుచుకుంటున్నాం. అమరలింగేశ్వర స్వామి కొలువైన పరమ పవిత్ర పుణ్యక్షేత్రం అమరావతి. పంచారామ క్షేత్రాల్లో అమరావతి మొదటిది. అమరావతి, ధరణి కోట అనే వేరు వేరు పేర్ల తో పిలువ బడే ఈ ప్రాంతం, అమరావతికి సంబంధించిన విశేషాలు, స్కాంద పురాణం, సహ్యాద్రి ఖండం లోను, బ్రహ్మపురాణం పూర్వ ఖండం లోను, పద్మపురాణం ఉత్తర భాగం లోను ప్రస్తావించబడినట్లు స్థలపురాణం చెబుతోంది. అమరావతినే స్థానికులు దక్షిణ కాశిగా కూడా పిలుస్తారు. అమరావతిలోని ధరణికోట ఘాట్ గుంటూరు జిల్లాలోనే అతిపెద్ద ఘాట్. ఈ ఘాట్ మొత్తం 1.3 కి.మీ మేర విస్తరించి ఉంది. ఈ ఘాట్ వద్ద మూడు పుష్కర నగర్ లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఘాట్ వద్దకు రోజుకు రెండు నుంచి మూడు లక్షల మంది పుష్కర స్నానాలకు వస్తారని అంచనా. చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్న అధికారులు, సిబ్బింది. సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ రోడ్లను విస్తరించి, రవాణా సౌకర్యాలను మెరుగుపరిచిన ప్రభుత్వం. పర్యాటక శాఖ వారు హైదరాబాద్ ట్యాంక్ బండ్ తరహాలో ప్రత్యేక ఆకర్షణ గొలిపేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు.

మోపిదేవి సుబ్రహ్మణ్మేశ్వరుడు స్థలపురాణం
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలోని మూలమూర్తి స్వయంభూలింగం. వీరారపు పర్వతాలు అనే కుమ్మరి శివభక్తుని భక్తికి మెచ్చి శివుడు కలలో కనిపించి మోపిదేవి గ్రామంలోని చీమలపుట్టను త్రవ్వి తన లింగాన్ని బయల్పర చమని ఆదేశించాడని చెబుతారు. పర్వతాలు తన కల గురించి గ్రామస్థులకు తెలియజేసి కలలో కనిపించిన ప్రదేశంలో చీమలపుట్టను తొవ్వంచినప్పుడు బయల్పడిన లింగాన్ని ఆ చీమలపుట్టపైనే ప్రతిష్టించి గ్రామస్థులు పూజించడం ప్రారంభించారు.

ఇక మోపిదేవి సమీపంలో ఉన్న పెదకళేపల్లి ఘాట్ వద్ద పుష్కర స్నానానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. నీరు పుష్కలంగా చేరడంతో అధికారులు భక్తుల కు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 40 అడుగుల మేర నీరు ఉంది. భక్తులకు అన్నీ వసతులు కల్పించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పరవళ్లు తొక్కుతూ కృష్ణ్ణమ్మ దూసుకుపోతూ గలగలా పారుతూ మహాద్భుత జల దృశ్యాన్ని ఆవిష్కరిస్తోంది.

ఈ లింగాకారామే సుబ్రమణ్యస్వామిగా పూజలందు కుంటాడు. చుట్టూ పచ్చదనం, ఆహ్లాదభరితం, నయనానందకరం, భక్తి పార వశ్యంతో కొండలు, కోనలు, జాలువారే జలపాతాలు, శంభో శంకర, ఓం నమః శివాయ స్మరణతో మార్మోగుతున్న ప్రాంతాలతో కృష్ణాతీరం విరాజిల్లుతోంది.

Leave a Reply