ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ తెలంగాణలోకి ప్రవేశించింది. ఆ రెండు రిజర్వాయర్లూ నిండుకుండలా మారడంతో వచ్చిన నీటిని వచ్చినట్టు అధికారులు కిందకు వదులుతుండగా, కొద్దిసేపటి క్రితం నీరు తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాను తాకింది. అప్పటివరకూ నీలి రంగులో ఉన్న నీళ్లు, ఎరుపు రంగులోకి మారింది. దీంతో అక్కడి స్థానిక ప్రజలు సంబరాలు చేసుకుంటూ, కృష్ణమ్మకు పూజలు జరిపారు. ఎల్లుండి జూరాల నుంచి శ్రీశైలానికి నీటిని విడుదల చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.
మహారాష్ట్ర, కర్ణాటకలలో కురిసిన వర్షాలతో ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులను దాటిన కృష్ణానది వరద జూరాల ప్రాజెక్టుకు చేరింది. నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి సోమవారం సాయంత్రం విడుదలైన వరద మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మాగనూరు మండలానికి చేరుకుంది. వర్షాకాలం ప్రారంభమైన నాటినుంచి కృష్ణానది వరద కోసం ఎదురు చూస్తున్న జిల్లాలోని ప్రాజెక్టుల ఆయకట్టు రైతులతోపాటు ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాగునీటితోపాటు ముఖ్యమైన పట్టణాలకు తాగునీటిని అందిస్తున్న జూరాల ప్రాజెక్టుకు వరద రావడం వర్షాకాలంలో తొలిసారి కావడంతో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
సోమవారం సాయంత్రం నారాయణపూర్ ప్రాజెక్టులో నాలుగు క్రస్టుగేట్లను తెరచి 28,950 క్యూసెక్కులను మొదటిసారిగా విడుదల చేయడం ప్రారంభించారు. పై నుంచి ఇన్‌ఫ్లో పెరగడంతో నారాయణపూర్ ప్రాజెక్టులో మొత్తం గేట్లను తెరచి రాత్రి 10గంటలకు 1.31లక్షల క్యూసెక్కులను విడుదల చేశారు. మంగళవారం ఉదయం 6గంటల వరకు 1.37,004 క్యూసెక్కుల విడుదల కొనసాగింది. ఆల్మట్టి నుంచి నారాయణపూర్‌కు వస్తున్న ఇన్‌ఫ్లో వరద తగ్గడం తో నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి విడుదల చేస్తున్న ఔట్‌ఫ్లో వరదను త గ్గిస్తూ వచ్చారు. ఉదయం 11గంటలకు నారాయణపూర్ నుంచి 77,568 క్యూసెక్కుల విడుదల జరగగా సాయంత్రం 3గంటలకు 43,488 క్యూసెక్కులు రాత్రి 7గంటలకు 33,264 క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని జూరాల రిజర్వాయర్‌కు విడుదల చేస్తున్నారు.
మంగళవారం మధ్యరాత్రి నుంచి బుధవారం ఉదయంలోగా జూరాల రిజర్వాయర్‌కు కర్ణాట క నుంచి ఇన్‌ఫ్లో వరద చేరే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. కర్ణాటకలోని ఆల్మట్టి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 129.72 టీఎంసీలు కాగా ఇన్‌ఫ్లో వరద 95,656 క్యూసెక్కులు వస్తోంది. నీటినిల్వను 122.8 టీఎంసీలుగా నిర్వహిస్తూ దిగువ నదిలోకి విద్యుదుత్పత్తి ద్వారా 45వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. మొత్తం క్రస్టుగేట్లను మూసివేశారు. నారాయణపూర్ ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటినిల్వ చేరడంతో పై నుంచి వస్తున్న ఇన్‌ఫ్లో ఆధారంగా వరద నీటిని దిగువకు విడుదల చేయడం కొనసాగిస్తున్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 9.65 టీఎంసీలు కాగా ప్రస్తుతం రిజర్వాయర్‌లో 3.58 టీఎంసీల నీటినిల్వ ఉంది.
నారాయణపూర్ నుంచి వచ్చే వరద ప్రవాహంతో గురువారం సాయంత్రంలోగా పూర్తిస్థాయికి నీటినిల్వ పెరగగానే విద్యుదుత్పత్తి ద్వారా శ్రీశైలం రిజర్వాయర్‌కు నీటి విడుదలను ప్రారంభిస్తారు. పర్యాటకులతో కళకళ ఎగువ నుంచి కురుస్తున్న వానలతో… జలపాతలు కళకళలాడుతున్నాయి, కరీంనగర్ జిల్లా కమాన్‌పూర్-పెద్దపల్లి మండలాల సరిహద్దులోని గౌరీగుండం జలపాతంలో స్నానాలు చేస్తున్నారు పర్యాటకులు అటు ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని కుంటాల జలపాతం వద్ద పర్యాటకుల సందడితో కళ కళలాడుతోంది. ఇటు ఖమ్మం జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి అటవీప్రాంతంలో ఉన్న బొగత జలపాతం సందర్శనకు పర్యాటకులు తరలివచ్చారు.