తమిళనాడు గవర్నర్ గా రెబల్ స్టార్?

Posted January 6, 2017

krishnamraju as tamilnadu governor
ప్రముఖ నటుడు, మాజీ కేంద్రమంత్రి, రెబల్ స్టార్ కృష్ణంరాజుకు కేంద్రం బంపర్ ఆఫర్ ఇవ్వబోతుందా? బీజేపీ పెద్దలు ఆయన వైపే మొగ్గు చూపుతున్నారా? రెబల్ స్టార్ ఎంపిక లాంఛనమేనా? అంటే ఔననే సమాధానమే వస్తోంది.

బీజేపీ నేతగా ఉన్న కృష్ణంరాజుకు తమిళనాడు రాజకీయాలపై కొంత పట్టుంది. తెలుగు ఇండస్ట్రీ చెన్నైలో ఉన్నప్పుడు అక్కడే చాలాకాలం నివసించారు. పలు రాజకీయ నాయకులతోనూ సత్సంబంధాలున్నాయి. పైగా ఈయన తమిళంలోనూ మాట్లాడతారు. గతంలో కేంద్రమంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. ఈ నేపథ్యంలో అర్హత, అనుభవం దృష్ట్యా కృష్ణంరాజు కరెక్ట్ వ్యక్తి అని బీజేపీ పెద్దలు భావిస్తున్నారట. ఆదిశగా ఇప్పటికే రెబల్ స్టార్ తోనూ మాట్లాడారట. గవర్నర్ గా వెళ్లేందుకు రాజు గారు కూడా సానుకూలంగా ఉన్నారని చెబుతున్నారు. అది కూడా పక్కనే ఉన్న తమిళనాడుకు కావడంతో రెబల్ స్టార్ కొంత ఆసక్తి చూపుతున్నారని టాక్.

తమిళనాడు గవర్నర్ గా రోశయ్య పదవీకాలం గతేడాది ముగిసింది. అప్పట్నుంచి ఇంఛార్జ్ గవర్నర్ తోనే నెట్టుకొస్తున్నారు. మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్న విద్యాసాగర రావు ఇక్కడ ఇంఛార్జ్ గా వ్యవహరిస్తున్నారు. కొత్త గవర్నర్ వస్తారని అప్పట్లోనే వార్తలొచ్చినా.. జయ అస్వస్థత, ఆ తర్వాత ఆమె మరణం నేపథ్యంలో అది వాయిదా పడింది. మహారాష్ట్ర గవర్నర్ గా విద్యాసాగర రావు బిజీగా ఉండడంతో ఇక కొత్త గవర్నర్ ఎంపిక అనివార్యంగా మారింది. ఆ అవకాశం ఇప్పుడు కృష్ణంరాజుకు దక్కనుందని టాక్.
మాజీ గవర్నర్ రోశయ్య, ఇంఛార్జ్ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర రావు కూడా తెలుగువారే. ఇప్పుడు మరోసారి తెలుగు వ్యక్తే రేసులో ఉండడం హాట్ టాపిక్ గా మారింది.

SHARE