కేటీఆర్, లోకేష్ సేమ్ పించ్

Posted April 4, 2017

ktr and lokesh same pinchలోకేష్ కు ఏపీ క్యాబినెట్ బెర్త్ దక్కడంతో.. రెండు తెలుగు రాష్ట్రాల్లో వారసుల మధ్య పోటీ మొదలైనట్లే అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మొదట్లో కేసీఆర్ కూడా కేటీఆర్ కు ఐటీ, పంచాయితీ రాజ్ శాఖే ఇచ్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత.. హామీల అమలుకు వీలుగా పట్టణాభివృద్ధి శాఖను కూడా కుమారుడికి అప్పగించారు. అటు కేటీఆర్ కూడా కీలక శాఖలను సమర్థంగా నిర్వహిస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకుంటున్నారు.

ఇప్పుడు లోకేష్ కు కూడా చంద్రబాబు ఐటీ, పంచాయతీ రాజ్ శాఖే ఇచ్చారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయముంది కాబట్టి..ఆలోగా లోకేష్ తన పనితీరుతో జనంలోకి చొచ్చుకెళతాడని బాబు భావిస్తున్నారు. అవసరమైతే ఏడాది తర్వాత లోకేష్ కు మరిన్ని శాఖలు అప్పగించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. లోకేష్ కు ఇప్పటికే తెరవెనుక మంత్రాంగం జరపడంలో తండ్రికి తగ్గ తనయుడనే పేరొచ్చేసింది. టీడీపీలో తన ముద్ర వేసిన లోకేష్.. ఇప్పుడు ప్రభుత్వంపై కూడా పట్టు సాధిస్తే.. చంద్రబాబు కూడా కొన్ని బాధ్యతలు తగ్గించుకునే అవకాశం ఉంది.

కేంద్రం నుంచి పంచాయతీ రాజ్ శాఖకు భారీగా నిధులొస్తున్నాయి. ఇక ఐటీ పరంగా ఏపీ స్టార్టప్ స్టేజ్ లో ఉంది కాబట్టి.. భవిష్యత్తులో చాలా అవకాశాలుంటాయి. కాబట్టి రెండు శాఖల మంత్రిగా లోకేష్ పై ఎక్కువ ఫోకస్ ఉంటుందని చంద్రబాబు లెక్కలేసుకున్నారు. అటు లోకేష్ కూడా తండ్రి తనపై ఉంచిన కీలక బాధ్యతలకు న్యాయం చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఐటీ, పంచాయతీ రాజ్ శాఖల డేటా తెప్పించుకున్న లోకేష్.. వాటిపై లోతుగా స్డడీ చేస్తున్నారట. తనకంటూ ఓ టీమ్ ఏర్పాటుచేసుకున్న లోకేష్ వాళ్ల ద్వారా.. అధికారుల పనితీరు, ప్రజల్లో వస్తున్న స్పందనను కూడా అంచనా వేసి.. ఏపీ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తారని టీడీపీ నేతలు నమ్ముతున్నారు.

SHARE